ఈ ఏడాది యాసంగిలో సాగవుతున్న పంటలను వ్యవసాయ అధికారులు ఏమాత్రం అంచనా వేయలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ యాసంగికి ముందే వరి పంటను సాగు చేయించకుండా ప్రణాళికలను తయారుచేయాలని అగ్రికల్చర్ అధికారులకు సూచించినా.. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ఏడాది వద్దని చెప్పిన వరి పంట ఇప్పటివరకు 34,21,625 ఎకరాల్లో సాగైంది.
హై-దరాబాద్, ఆంధ్రప్రభ: యాసంగిలో ముఖ్యంగా సాగుచేయాల్సిన పంటల ప్రణాళికను సైతం అధికారులు ప్రకటించకపోవడం వలన కూడా రైతులు వరిని పెద్ద ఎత్తున సాగుచేసినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో గరిష్టంగా సాగుచేయించాలని భావించిన మొక్కజొన్న, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు మాత్రం ఆశించిన మేరకు సాగుకాలేదు. దీంతో ఈ యాసంగిలోనూ మళ్లీ వరి పంట అధిక విస్తీర్ణంలో సాగైనట్టు స్పష్టమవుతుంది. యాసంగిలో అన్ని పంటలు కలుపుకుని ఇప్పటివరకు 50,46,256 ఎకరాల్లో సాగయ్యాయి.
సాధారణ విస్తీర్ణాన్ని మించుతున్న వరి..
గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన యాసంగి సీజన్‌లో వరిని తగ్గించి దాని స్థానంలో ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయించాలని సీఎం కేసీఆర్ వ్యవసాయ అధికారులకు సూచించినా పటిష్టమైన ప్రణాళికలను తయారుచేయకపోవడంతో పాటు వరిని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ యాసంగిలో వరి సాగు సాధారణ విస్తీర్ణం కంటే 10శాతం అధికంగా సాగైంది. ఈ మేరకు ప్రస్తుత యాసంగిలో సాధారణ సాగు 31,01,258 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 34,21,625 ఎకరాల్లో సాగు జరిగింది. కాగా గతేడాది ఇదే సమయానికి 50,36,187 ఎకరాల్లో వరి సాగయ్యింది. దీంతో సాధారణ విస్తీర్ణాన్ని మించి మరీ వరి సాగవుతుందని స్పష్టమవుతోంది.
యాసంగిలో సాగైన పంటల వివరాలు.. పంట విస్తీర్ణం (ఎకరాల్లో)
వరి 34,21,625
మొక్కజొన్న 4,42,842, జొన్నలు 1,04,004, శనగ 3,65,039
వేరు శనగ 3,41,120, కంది 4,690, పొద్దు తిరుగుడు 35,940
కుసుమ 17,056, రాగులు 2,090, కొర్రలు 739
పెరగని శనగ, వేరుశనగ, మొక్కజొన్న..
యాసంగిలో వరిని తగ్గించి ఆ స్థానంలో శనగ, వేరుశనగ, మొక్కజొన్న పంటలను గరిష్టంగా సాగుచేయించాలని భావించిన వ్యవసాయశాఖకు ఆశాభంగం కలిగింది. మొక్కజొన్న పంటను సుమారు 12లక్షల ఎకరాలకు పైగా సాగుచేయించాలని తలంచినా.. ఇప్పటివరకు 4,26,842ఎకరాల్లో సాగైంది. కాగా దీంతో పాటు శనగ, వేరు శనగ పంటలను 20లక్షల ఎకరాల్లో సాగుచేయించాలని అధికారులు భావించినా అది ఏమాత్రం కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రస్తుతం శనగ 3,65,039 ఎకరాల్లో సాగు కాగా ఇది గతేడాదితో పోల్చితే కేవలం 15 నుంచి 20వేల ఎకరాల్లోనే పెరిగినట్టు సమాచారం. కాగా వేరుశనగ పంటను సైతం సుమారు 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో సాగుచేయించాలనుకున్నా..కేవలం 3,41,120 ఎకరాల్లోనే సాగైంది. కాగా గతేడాదితో పోల్చుకుంటే 81,595 ఎకరాల్లోనే పెరిగింది.
ప్రత్యామ్నాయం పండలే.. పప్పులు ఉడకలే..
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలను పండిచాలని, అందులోనూ ఎక్కువగా చిరు, తృణ ధాన్యాలతో పాటు పప్పులు, నూనె గింజల పంటలను పండించాలనుకున్న అధికారుల అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవ్వడంతోనే సాగు చేయించాలనుకున్న పంటలు సాగు కాకపోగా, వద్దన్న వరి మాత్రమే అధిక విస్తీర్ణంలో సాగైంది. దీంతో ఈ ఏడాది యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగుకాలేదు, పప్పు పంటలు పండలేదు. కాగా జూన్ నుంచి ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌కు అయినా అధికారులు పంటల ప్రణాళికను ప్రకటిస్తారా లేదోనన్న అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది.