Wednesday, November 20, 2024

పెరిగిన క్రూడాయిల్ ధ‌ర‌.. ప్రజలపై పెట్రో భారం పడకుండా కేంద్రం ఏం చేస్తుందంటే..

రష్యా ఉక్రెయిన్ వార్‌ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై ప‌డుతోంది. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు పెట్రోల్ ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. గురువారం సాయంత్రానికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $118 డాలర్లకు చేరుకోగా.. ఆ ప్రభావం పెట్రోల్, డీజిల్ పైనా పడింది. కాగా, భారత్ లో ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ వినియోగదారులపై పడితే సామాన్య ప్రజలు తట్టుకోలేరు. పెట్రోల్ ధరల విషయంలో ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే విధంగా ధరలు పెంచుకుంటూ పోతే ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంద‌ని ఆర్ధిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈక్రమంలో ఆ భారం ప్రజలపై పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

అందులో భాగంగా లీటరు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకన్నీ రూ.8-10 మేర తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగితే ఆ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తుంది. ఈలెక్కన ఇప్పటికే పెరిగిన క్రూడ్ ధరలకనుగుణంగా భారత్ లో లీటర్ పెట్రోల్ డీజిల్ పై సరాసరి రూ.12 వరకు పెరుగుదల కనిపించాలి. ధరలు పెరగక పోవడంతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రభుత్వం పెట్రోల్ ధరను పెంచినా పెంచొచ్చని కొందరు ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. ఈ లాభనష్టాలను బేరీజు వేసుకుంటే.. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు.. తమ టాక్స్ పరిధిలోని ఎక్సైజ్, వ్యాట్ టాక్స్ ను సరిసమానంగా తగ్గిస్తే అటు ప్రభుత్వాలపైనా నష్ట ప్రభావం తగ్గి, ఇటు ప్రజల పైనా పెట్రో భారం తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement