శ్రీలంక లాంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభం భారత్‌లో కూడా రావచ్చని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా కేంద్రం వద్ద తగినంత డబ్బులు లేవని ఆయన విమర్శించారు. రెండేళ్లలో ఎఫ్‌సీఐకి రూ.4.27 లక్షల మేర సబ్సిడీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. కేంద్రం వద్ద నిధులు లేవని, ఈ ప్రభుత్వం దివాళా తీసిందని ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. మరోవైపు రోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై సోమవారం రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లిన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో రెండు సార్లు రాజ్యసభ వాయిదా పడింది. అయినప్పటికీ సభ అదుపులోకి రావకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది.
దీనికి ముందు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై రూల్ 267 కింద చర్చ చేపట్టాలని విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. కాగా, పెట్రో అంశంపై లోక్‌సభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వెల్‌లోకి దూసుకువెళ్లిన డీఎంకే సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, శివసేన పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు.