Saturday, November 23, 2024

రాజ‌స్థాన్ కాంగ్రెస్‌లో దుమారం.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభం!

రాజస్థాన్ కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడంతో ముఖ్యమంత్రి ప‌ద‌వి ఎవరికి దక్కాలన్న దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు అక్క‌డి నేత‌లు. దీంతో రెండు వ‌ర్గాలుగా విడిపోయి గంద‌ర‌గోళానికి తెర‌తీశారు. ఇక‌.. రాజస్థాన్ తదుపరి
సీఎం పదవి రేసులో సచిన్ పైలట్ ముందున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతుండగా గెహ్లాట్ వర్గం మాత్రం అందుకు అంగీక‌రించ‌డం లేదు. నిన్న (ఆదివారం) సాయంత్రం సీఎల్పీ సమావేశం నిర్వహించి త‌ర్వాత‌ సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించారు.

అయితే, అంతకంటే మందే గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి సంచ‌న‌లం సృష్టించారు. తాను కూడా రాజీనామా చేస్తానని పీసీసీ అధ్యక్షుడు ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో స్పందించిన అధిష్ఠానం సీఎల్పీ భేటీని రద్దు చేసింది. సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా వెళ్లిన గెహ్లాట్, పైలట్ సహా అందరినీ ఢిల్లీ రావాలని ఆదేశించింది.

జోడు పదవులు కుదరవస‌ని రాహుల్ చెప్పడం వల్లే..
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించిన అశోక్ గెహ్లాట్.. ముఖ్యమంత్రిగా కొనసాగాలని భావించారు. అయితే, ఒకే వ్యక్తికి జోడు పదవులు కుదరవని రాహుల్ గాంధీ ఆ పార్టీ తీర్మానంలో పొందుప‌ర‌చిని విష‌యాన్ని గుర్తు చేయడంతో అసలు రచ్చ మొదలైంది. సీఎం ప‌ద‌వి నుంచి తప్పుకుంటూనే తనకు విశ్వాసపాత్రుడైన వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలని గెహ్లాట్ భావించారు. అయితే, అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్‌ను సీఎం చేయాలని భావించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గెహ్లాట్ ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న సీపీ జోషికి ఆ పదవిని క‌ట్ట‌బెట్టేందుకు పట్టుదలగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

పైలట్ తిరుగుబాటే కారణమా?
రెండేళ్ల క్రితం గెహ్లాట్ సర్కారుపై సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. ఇప్పుడిదే ఆయనను సీఎం కాకుండా అడ్డుకుంటోందని ప‌లువురు ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించిన వ్యక్తికి సీఎం పీఠం ఎలా అప్పగిస్తారన్నది గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల వాదన. అప్పట్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. సచిన్ పైలట్‌కు సీఎం పీఠం అప్పగించాలన్న అధిష్ఠానం నిర్ణయాన్ని నిరసిస్తూ గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

- Advertisement -

స్పీకర్ జోషి నివాసానికి వెళ్లి త‌మ రాజీనామా లేఖలు సమర్పించారు. పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కూడా పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. గెహ్లాట్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే, ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారని, తానేమీ చేయలేనని ఆయన చేతులెత్తేసినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement