చాలాకాలంగా గుట్కా అమ్మకాలపై నిఘా పెట్టిన పోలీసులకు అసలు ఎక్కడ తయారవుతోంది.. ఎక్కడికి సప్లయ్ అవుతోందన్న అనుమానాలుండేది. దీంతో ఓ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. సినీ ఫక్కీలో అమ్మకం చేస్తున్న వారి నుంచి అసలు సూత్రధారుల ఆధారాలు తీసుకుని వారి దగ్గరికెళ్లి తామూ అమ్మకందారులమే.. గుట్కా కావాలని అడగారు. దీంతో వారికి ఓ లీడ్ దొరికింది. ఈ లీడ్ ఆధారంగా అసలు ముఠాను పట్టుకుని జైలుకు తరలించారు.
హైదరాబాద్, ప్రభ న్యూస్: వివిధ బ్రాండ్ల పేరుతో నిషేధిత గుట్కాలను తయారుచేసి హైదరాబాద్ సిటీతో పాటు పలుప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గోదాముల ద్వారా సరఫరా చేస్తున్నా ముఠా గుట్టును చిలకలగూడ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుండి 44లక్షల 60వేల రూపాయల విలువైన గుట్కాలు, ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గోపాలపురం ఏసీపీ సుధీర్ కుమార్, చిలకలగూడ ఇన్స్పెక్టర్ నరేష్, డీఐ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కాల తయారీ చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ముషీరాబాద్ రెవెన్యూ అధికారులు, ముషీరాబాద్ పోలీసుల సహకారంతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. మైలార్‌గడ్డ ఆశిర్వాద్ లైన్లో ఓ ఇంటికి నాటకీయ ఫక్కిలో వెళ్ళి కొనుగోలు దారులుగా గుట్కా కోసం ఆరాతీసారు.
ఇక్కడ ఉన్న గుట్కా నిలువలపై పూర్తి సమాచారం తీసుకుని గుట్కాలను తయారు చేసి విక్రయిస్తున్న తలారి నవీన్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీసుల లెవల్లో నాలుగు తగిలించి ఎంక్వైరీ చేయగా.. మొత్తం గుట్టంతా బయటపడింది. దీంతో గుట్కా తయారీకి వినియోగించే ముడి సరుకుతో పాటు 5లక్షల విలువై గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి ముడి సరుకును అందించడంతో పాటు, గుట్కాలను పలు ప్రాంతాలకు సరఫరా చేస్తూ విక్రయిస్తున్న ప్రదీప్‌కుమార్ అగర్వాల్‌ను కంచన్‌భాగ్ బహుదూర్ పురాలో అరెస్ట్ చేసారు.ఇతని వద్దనుండి 31.50లక్షల విలువై గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే వీరి వద్ద ముడిసరుకు తీసుకుని గుట్కా విక్రయాలు చేస్తున్న సూరారం ప్రాంతానికి చెందిన సింహద్రి మదన్‌ను అరెస్ట్ చేసిఅతని వద్దనుండి 3.5లక్షల విలువైన గుట్కాలు, కాచిగూడలో ఇంట్లోనే గుట్కా మిషన్‌ను పెట్టి గుట్కాలు తయారు చేస్తున్న దలాల్ గోవింద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. ఇతని వద్దనుండి తయారీ మిషన్లతో పాటు4లక్షల 60వేల విలువై గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితలను పట్కోవడంలో సహకరించిన రెవెన్యూ సిబ్బందిని, ఎస్ఐలు శ్రీనివాసరావు, సాయికృష్ణలతో పాటు పోలీసు సిబ్బందిని ఈసందర్భంగా ఏసీపీ సుధీర్‌కుమార్ అభినందించారు.