న్యూజిలాండ్తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో టీమిండియా బౌలర్లు నిరుత్సాహపరిచారు. సొంతగడ్డపై కూడా ఒక్క వికెట్ తీయడానికి అపసోపాలు పడుతున్నారు. కివీస్ ఓపెనర్లు పట్టుదలతో ఆడి 129 పరుగులు చేశారు. రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 345 పరుగులకు ఆలౌటైంది. ఆపై, ప్రత్యర్థిని పేస్, స్పిన్ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరి చేద్దామని భావించిన భారత జట్టుకు ఆశాభంగం కలిగింది. భారత బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
రెండో రోజు ఆట ముగిసే నాటికి కివీస్ స్కోరు వికెట్ నష్టపోకుండా 129 పరుగులు. ఓపెనర్లు విల్ యంగ్ 75 పరుగులతోనూ, టామ్ లాథమ్ 50 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ముఖ్యంగా విల్ యంగ్ భారత బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కొన్నాడు. అతడి స్కోరులో 12 ఫోర్లున్నాయి. ఈ జోడీపై ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.