Friday, November 22, 2024

నేటి చదువుల్లో సృజనాత్మకత పెరగాలి.. ఉపాధి చూపని విద్యావిధానం మారాలి..

ప్రభన్యూస్ : ఇంటర్‌ చదువు పూర్తి చేసిన పిదప విద్యార్థులు ఏం చదవాలో తికమక పడుతుంటారు. ఈ స్థాయిలోనే ఉత్తమమైన ఆలోచనలతో చదువుల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తికమకలాంటి పరి ధిని దాటి ఆలోచించి మలిమెట్టు ఎక్కడానికి సమయం అసన్నమైందని విద్యార్థులు గ్రహించాలి. ప్రతి విద్యార్థి వారితో పాటు తల్లిదండ్రులు కూడా ఆలోచించగలగాలి. మధ్య తరగతి జీవుల కల ఇంజనీరింగ్‌ లేదంటే మెడిసిన్‌. తమ పిల్లలు ఇంజనీరో లేదంటే డాక్టరో అవ్వాలని కన్న కలలే కాక జీవితంలో స్థి రపడి పోయినట్లే అని తలుస్తారు. ఇందుకోసమే తమ పిల్లలకు ఇష్ట మున్నా లేకపోయినా సైన్స్‌ గ్రూపుల చదువులు చదివించి ఎంసెట్‌, నీట్‌ ర్యాంక్‌లు సాధించాలని అకాంక్షిస్తారు. ఎంసెట్‌లో ర్యాంకులు సాధిస్తే పిల్లలు స్థిరపడినట్లే అని తలుస్తున్న తల్లిదండ్రులు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లో ఉద్యోగాలు లభిస్తున్నాయా లేవా అన్న విషయమై ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఎంసెట్‌ కాక ఉన్న ఇతర చదువులు సమాజంలో ఉన్నత స్థాయిలో నిలిపేవికూడా ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా ఎంసెట్‌ రాయడానికే ప్రతీ ఏడు అధికంగా విద్యార్థులు మొగ్గుచూపడంతో పాటు, వారి తల్లిదండ్రులు కూడా అదే స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు. ఎంసెట్‌కోసం లక్షలు ఖర్చు చేసి ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లో చేరటానికి మరిన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎంతమంది ఉద్యోగాలు లభించక నిరుత్సాహ పడుతున్నారో చెప్పటం కష్టమే. మిగిలిన వారికి భిన్నంగా వీరి కెరీర్‌ ఉందా అంటే అది చెప్పటం కష్టమే. అయినప్పటికీ ఎంసెట్‌, నీట్‌ ఫలితాల్లో ఉన్నత ర్యాంకులు సాధించాలనే పట్టుదలతో ఉన్నారంటే మానసికంగా ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ను ఓ వారధిగా భావిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. అందుకే ఎంసెట్‌ కోచింగ్‌ ఒక వ్యాపారంగా మారిపోయిందన్న వాదన వినిపిస్తోంది. ఇంటర్మీడియట్‌ విద్య కొరకే లక్షలు ఖర్చుచేసి మన ప్రభుత్వం ఎంసెట్‌కు ప్రత్యేకంగా ప్యాట్రన్‌ క్రియేట్‌ చేసింది.

ర్యాంక్‌ సాధించకపోతే..

ఎంసెట్‌, నీట్‌, జేఈఈలో మంచి ర్యాంక్‌ సాధించి పేరున్న కాలేజీలో సీటు లభించని ఎడల జీవితం అక్కడితో ఆగిపోదు. అదృష్ట మమే చేజారి పోయిందని బాధ పడకూడదు. ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషించాలి. ఇంజనీరింగ్‌ కోర్సు ఒక్కటే నిజానికి కెరిర్‌కు ఉపయోగపడేదని అనుకోవద్దు. ప్రస్తుతమున్న అవకాశాల్లో పర్యాటకం, ఫ్యాషన్‌, చార్టర్‌ ఆకౌంటెన్సీ, సీఎస్‌ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్యాషన్‌ రంగం యువతను అమితంగా ఆకర్షిస్తోంది. బీఏ, బీకాం, ఇంజనీరింగ్‌ చేసిన ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేదు. ప్రస్తుతం ఎక్కువగా సిల్క్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ చేస్తున్నారు. కుకింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, యామినేషన్‌ రంగాలు ఎన్నో మన ముందున్నాయి. అటువైపు కెరిర్‌ను మలుచుకోవటానికి ప్రయత్నించవచ్చు. కొంతమేర విద్యార్థులు ఆయా రంగాలవైపు మొగ్గుచూపుతూ ప్రయత్నాలు మొదలు పెడుతున్న మధ్యతరగతి తల్లిదండ్రుల్లో అధికంగా ఎంసెట్‌, నీట్‌, జేఈఈ పైనే మోజు పెంచుకోవటం చాలా విచారకరమనడం విద్యావంతుల భావన.

నిష్ణాతుల సలహాతో…

- Advertisement -

మా ఫ్రెండ్స్‌ పలానా కాలేజీలో చదువుతున్నారని, ఎంసెట్‌, లేదా అదే స్థాయిలో ప్రిఫెర్‌ అవుతున్నారన్న ఆందోళన చెందకుండా విద్యారంగంలో నిష్ణాతులైన మేధావుల సలహాతో ముందుకు వెళ్లడం మంచిది. అంతే కాని సహా మిత్రుల మాదిరిగా తాను ఫాలో అవడం కరెక్టు కాదు. క్లారిటి లేకుండా ఏ కోర్సును ఎంపిక చేసుకోకూడదు. అలాంటప్పడు సింపుల్‌గా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు చేసిన తర్వాత తమ మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. దీంతో పాటు ఓ హాబీ క్రియేట్‌ చేసుకుంటే కెరిర్‌గా ఉపయోగపడవచ్చును. ఈ సమయంలో తల్లిదండ్రుల నిర్ణయాలను శిరోధార్యంగా భావించకుండా విద్యావంతుల సలహా, సూచనలు, అభిప్రాయాలు స్వీకరించటం మంచిది. అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల ఇష్టాయిష్టాలను ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేం కాలేదు కాబట్టి మా పిల్లలైనా కావాలనే ఆకాంక్షను తమ పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలని భావించడం సబబు కాదన్నది విద్యావేత్తల భావన. కేవలం 10 శాతం మంది విద్యార్థులు ఎంసెట్‌కు కాని మరో సెట్‌కు కాని ఫ్రిపేర్‌ అవుతున్నారు తప్ప సుమారు 90 శాతం మంది విద్యార్థులు పేరెంట్స్‌ వత్తిడి మేరకే ఆయా సెట్లు రాస్తున్నామంటూ తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

కరోనాతో చదువులు చిన్నాభిన్నం..

2020 మార్చిలో మొదలైన కరోనా, లాక్‌డౌన్‌తో చదువులు తలకిందులయ్యాయి. అప్పటి వరకు ఎంతో కష్టపడి పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు, ఆన్‌లైన్‌ పేరిట అర్థం కాని చదువులకు పరిమితమయ్యారు. రెండేళ్ల పాటు ప్రభుత్వాలు విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినప్పటికీ, వారి ప్రమాణాలు పెరిగాయా, తరిగాయా అన్న అంశమై ఎటువంటి పరీక్షలు నిర్వహించక పోవడం గమనార్హం. అయితే రెండేళ్ల కాలంలో ఎక్కువ రోజుల పాటు పుస్తకాలకు దూరంగా విద్యార్థులు ఈ ఏడాది ఎటువంటి ప్రమాణాలతో ఉత్తీర్ణులవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.

మొదలైన ప్రచార దందా..

విద్యార్థుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకొని మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, జేఈఈలో శిక్షణ అందిస్తామని, ఇంటర్‌తో పాటే ఉన్నత విద్యావకాశాలకోసం విద్యార్థులకు త ర్ఫీదునిస్తామంటూ పలు కళాశాలలకు చెందిన టెలీకాలర్స్‌, మార్కెటింగ్‌ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ రకమైన ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముందస్తుగా అడ్మిషన్‌ ఫీజు రూపంలో పది నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా జిల్లా ఇంటర్మిడియట్‌ అధికారులు అటువైపు కన్నెతి కూడా చూడటం లేదని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement