Sunday, November 24, 2024

NASA: నింగికెగిరిన అర్టెమిస్‌-1.. ఫ్లోరిడాలోని కేప్‌కార్నివాల్‌ నుంచి ప్రయోగం

నాసా చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్టెమిస్‌-1 ప్రయోగం విజయవంతంగా మొదలైంది. అనేక సాంకేతిక అంతరాయాలను అధిగమించి, దాదాపు రెండు నెలల తర్వాత చంద్రుడివైపు ప్రయాణం ప్రారంభించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.17 గంటలకు రాకెట్‌ జాబిల్లి వైపు దూసుకెళ్లింది. ప్రయోగించిన కొన్ని నిమిషాల అనంతరం చంద్రుని వైపు ఓరియన్‌ అంతరిక్ష నౌకను రాకెట్‌ విడిచిపెట్టింది. సోమవారం నాటికి ఓరియన్‌ చంద్రుడి ఉపరితలం నుంచి 96.5 కిలోమీటర్లు దాటిపోతుంది. దాదాపు 25 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన అనంతరం డిసెంబర్‌ 11న పసిఫిక్‌ మహాసముద్రంలో పడనున్నది.

ఆర్టెమిస్‌-1 ప్రయోగం సాంకేతిక లోపాలు, వాతావరణ ప్రతికూలత కారణంగా గతంలో రెండు సార్లు (ఆగస్ట్‌ 29, సెప్టెంబర్‌ 3న) వాయిదా పడింది. మూడోసారి ప్రయోగం సందర్భంగా కొన్ని అవాంతరాలు తప్పలేదు. అయితే, వాటిని అధిగమించి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు నాసా తెలిపింది. వ్యోమగాములు లేని ఒరాయన్‌ స్పేస్‌ క్యాప్సూల్స్​ను కూడా తీసుకెళ్లింది. సుమారు 25 రోజులపాటు ప్రయాణిస్తుంది. 1.3 మిలియన్‌ మైళ్ల దూరం అలుపులేని ప్రయాణం చేస్తుంది. భవిష్యత్‌లో చంద్రుడిపైకి మనుషులను పంపడానికి ఈ ప్రయోగం దోహదపడుతుంది.

  • ఆర్టెమిస్‌ -1 ట్రాకింగ్‌ను ఇంగ్లండ్‌ నుంచి నిర్వహిస్తారు. గూన్‌హిల్లి ఎర్త్‌ స్టేషన్‌ నుంచి ట్రాక్‌ చేస్తారు.
  • మెర్లిన్‌ పేరిట నిర్మించిన భారీ డిష్‌ యాంటెన్నాను ఇందుకోసం వినియోగిస్తారు.
  • 1969లో నిర్వహించిన చంద్రయాత్రలో కూడా గూన్‌హిల్లి ఎర్త్‌స్టేషన్‌ కీలక పాత్ర పోషించింది.
  • ఒరాయన్‌ క్యాప్సూల్‌లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంది.
  • వేరొక వ్యోమనౌకకు అనుసంధానం కాకుండానే, ఏకబిగిన21 రోజులు చంద్రుడి కక్ష్యంలో పనిచేస్తుంది.
  • ఒరాయన్‌ క్యూప్సూల్‌లో వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్‌ ముఖ్యమైనది.రోదసి యాత్రలకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా దీన్ని తయారు చేశారు.
  • క్రూ మాడ్యూల్‌కు ఐరోపా నిర్మించిన సర్వీసు మాడ్యూల్‌ ఉంది. ఇంధనం, శక్తిని అందిస్తుంది. సౌరఫలకాలు కూడా ఉంటాయి.
  • తిరుగు ప్రయాణంలో ఒరాయన్‌ గంటకు40వేల కి.మీ. వేగంతో భూ వాతావరణంలోకి దూసుకొస్తుంది.
  • ఆ దశలో గాలి రాపిడివల్ల ఒరాయన్‌పై 2.750 డిగ్రీల్‌ సెల్సియస్‌ వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ ఉష్ణాన్ని తట్టుకునేలా వ్యోమనౌకకు ప్రత్యేక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement