Friday, November 22, 2024

హృద‌యాల‌ను కాపాడుకుందాం – ల‌క్ష మంది సామాన్యుల‌కు సిపిఆర్ లో శిక్ష‌ణ‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గుండె సంబంధిత వ్యాధులు ప్రాణాంతకమైనవనీ ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌)తో ప్రాణాలు కాపాడొచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. సమయం, సందర్భం, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర్రవ్యాప్తంగా నిర్వహించే సీపీఆర్‌ శిక్షణా కార్యక్రమాన్ని బుధ వారం మేడ్చల్‌లోని జీవీకే, ఈఎంఆర్‌ఐ వేదికగా మంత్రి హరీష్‌రావు, సహచర మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ సీపీఆర్‌ శిక్షణ ఆలోచన మంత్రి కేటీఆర్‌దేననీ, ఆయన మామగారు చనిపోయినప్పుడు అక్కడికి వెళితే సీపీఆర్‌ తెలిసిన వారు లేక ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆనాటి చర్చల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో సడెన్‌ కార్డియాక్‌ అరెస్టులు, హార్ట్‌ స్ట్రోకులు పెరుగుతున్నాయనీ, దీంతో దేశంలో ప్రతీ ఏటా 15 లక్షల మంది, సగటున రోజుకు 4000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.

అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ఏటా దాదాపు 24 వేల మంది ఈ హార్ట్‌ స్ట్రోక్‌, కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా చనిపోతున్నారని పేర్కొన్నారు. సీపీఆర్‌ చేసినప్పటికీ కొన్నిసార్లు గుండె స్పందించదనీ, అలాంటప్పుడు ఆటోమేటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డెఫిబ్రిలేటర్స్‌ (ఏఈడీ) అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా సాధ్యమవుతుందని వివరించారు. తొలి దశలో రూ.18 కోట్లతో 1200 ఏఈడీ పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కార్డియాక్‌ అరెస్ట్‌ అయిన పది మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారనీ, సీపీఆర్‌ చేస్తే కనీసం 5 మందిని బతికించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్‌ చేసేందుకు మెడికల్‌ పరిజ్ఞానం అవసరం లేదనీ, కొంత అవగాహన, కొంత సమయస్ఫూర్తి ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ విస్తరించాలన్నదే ప్రభత్వ ప్రయత్నమనీ, ఇందులో భాగంగా వైద్యారోగ్య, మున్సిపల్‌, పోలీసు, పంచాయతీరాజ్‌ శాఖల అందరికీ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. గ్రామ ప్రాంతాల్లో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితర ప్రజాప్రతినిధులందరినీ సీపీఆర్‌ శిక్షణలో భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో లక్ష మందికి శిక్షణ ఇవ్వాలి: మంత్రి కేటీఆర్‌
తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో బస్తీ దవాఖానాలు మొదలు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ల వరకు ఉత్తమ వైద్య సేవలు అందుతున్నాయని మున్సిపల్‌, ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. శారీరక శ్రమ తగ్గడం వల్ల జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు. గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలో అవగాహన లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో కనీసం లక్ష మందికి సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వాలని, సంవత్సరానికి 5 ప్రాణాలు కాపాడినా, 5 కుటుంబాలను కాపాడినట్లేనని చెప్పారు. విదేశాల్లో సంవత్సరానికి ఒకసారి మాస్టర్‌ చెకప్‌ చేసుకుంటారనీ, కానీ, మన దగ్గర మాత్రం ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడే వైద్యుడిని సంప్రదిస్తామనీ, ఇది సరైన పద్దతి కాదని అభిప్రాయపడ్డారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఆరోగ్యరంగం ఎంతగానో మెరుగుపడిందన్నారు. హైదరాబాద్‌ నగరంలో 4 టిమ్స్‌ ఆస్పత్రులతో పాటు వరంగల్‌లో హెల్త్‌ సిటీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేననీ పేర్కొన్నారు.

హరీష్‌రావు, కేటీఆర్‌ పరస్పర ప్రశంసలు
సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమం సందర్భంగా మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన హరీష్‌రావు సీపీఆర్‌ శిక్షణ ఆలోచన కేటీఆర్‌దేననీ, ఆయన మామగారు మరణించిన సమయంలో అక్కడికి వెళ్లినప్పుడు సీపీఆర్‌పై చర్చ జరిగిందన్నారు. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నామనీ, అది ఈ రోజు కార్యరూపం దాల్చిందనీ, అందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు అంటూ పొగిడారు. ఆ తరువాత మాట్లాడిన మంత్రి కేటీఆర్‌ ఇటీవల తన మామగారు గుండెపోటుతో మరణించారనీ, మంత్రి హరీష్‌రావుతో ఓ సందర్భంలో ఈ విషయం గురించి మాట్లాడితే సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేద్దామని అన్నారని పేర్కొన్నారు. తన సూచనను అంగీకరించి సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు హరీష్‌ రావుకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement