హైదరాబాద్,ఆంధ్రప్రభ : వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమే ప్రధాన లక్ష్యంగా ఇప్పటి నుంచే సమైక్య పోరాటాలు నిర్వహిం చాలని సీపీఐ , సీపీఎం సంయుక్త సమ్మేళనం పిలుపునిచ్చింది. మోడీని ఓడిస్తేనే దేశం బతుకుతుందని లేకుంటే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. వామపక్ష, సెక్యులర్, ప్రాంతీయ శక్తులు అప్రమత్తం కావాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించకతప్పదని ఆందోళనవ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు కలిసే ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని ఏకాభిప్రాయాన్ని ప్రకటించాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సీపీఐ, సీపీఎం సంయుక్తంగా చారిత్రక సమ్మేళనం నిర్వహించాయి. ఈ సమ్మేళనానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఇరు పార్టీలకు చెందిన దాదాపు 10 వేల మంది నాయకులు పాల్గొన్నారు.దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులను కాపాడు కునేందుకు లౌకిక శక్తులు కలిసి రావాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబాని తదితర ప్రైవేట్ వ్యక్తులకు దారాధత్తం చేస్తున్నారని విమర్శించారు. గడచిన తొమ్మిదేళ్లలో 11 లక్షల కోట్ల రుణాలను కార్పేరేట్ సంస్థలకు మాఫీచేసి దేశ ఆర్థిక వ్యవ స్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాల గద్దె దింపేందుకు ఈడీ, సీబీఐలను కేంద్రం విచ్చలవిడిగా వాడుకుంటోందని ఆరోపించారు.
రాజ్యాం గాన్ని మార్చి కాషాయ రాజ్యాంగాన్ని తీసుకురావాలనే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.అంబేడ్కర్ రాజ్యాం గాన్ని మార్చేసి మనుధర్మాన్ని తీసుకువస్తామని బీజేపీ దాని అనుబంధ సంస్థలు చేస్తున్న సవాల్‌ను స్వీకరించి వచ్చే ఎన్నికల్లో ఈ మతతత్వ శక్తులను ఓడిద్దామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపునిచ్చారు. కుల, మతోన్మా దాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య సమైక్యతకు గొడ్డలిపెట్టుగా మారిన బీజేపీని ఓడించేందుకు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని విజ్ఞప్తిచేశారు. ఆర్థిక అసమాతలు, కులవివక్ష, నిరుద్యోగం విపరీతంగా పెరిగి ప్రజలు ముఖ్యంగా యువత నిరాశ, నిస్పృహలకు గురవు తోందని రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే సంస్కృతి, ఒకే రాజకీయ పార్టీ (బీజేపీ) , ఒకే ప్రధాని అంటూ బీజేపీ చేస్తున్న కుట్రలను భగ్నం చేయాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సమాఖ్య వ్యవస్థ (ఫెడరల్ సిస్టం)కు పెను ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ఎర్రజెండాలు ఒక్క జెండాగా మారాలని లెఫ్ట్ శ్రేణులకు రాజా పిలుపునిచ్చారు.
చట్టసభల్లో ప్రాతినిథ్యముండాలి
బీజేపీ హయాంలో అభివృద్ధి జరగటం లేదని ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయని సీపీఎం పొలిట్ బ్యూురో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అతిపెద్ద అవినీతి ప్రభుత్వమేదైనా ఉందంటే అది మోడీ ప్రభుత్వమేనని ఆరోపించారు. చట్ట సభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని, కమ్యూనిస్టులు చట్ట సభల్లో లేకపోతే గుడిలో విగ్రహం లేని దేవుడిలా పరిస్థితి ఉంటుందని రాఘవులు చమత్కరించారు.
ఐక్యత అసాధ్యమేమీ కాదు: నారాయణ
లెఫ్ట్ పార్టీల మధ్య ఐక్యత అసాధ్యమేమీ కాదని, కింద మీరు గిచ్చుకుంటే …,పైన మేం గిల్లుకుంటామని, అలాంటి పరిస్థితి రానివ్వవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తన సహజ దోరణిలో వ్యాఖ్యానించి అందరినీ నవ్వించారు.
జగన్నాథ రథచక్రాల్లా నడుద్దాం: కూనంనేని
సీపీఐ, సీపీఎం ఒక్క తల్లికి పుట్టిన బిడ్డలని జగన్నాధ రథచక్రాల్లా కలిసి నడుద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. వామపక్షాల నేతలు ఎవరికి కూడా లొంగరని, నిజంగావారు లొంగిఉంటే సీఎం, ప్రధానమంత్రి పదవులు ఎప్పుడో వచ్చేవని చెప్పారు.
ఈ సంగమం దేశానికి సంకేతం: తమ్మినేని
సీపీఐ, సీపీఎం కలిసి ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనం దేశానికి సంకేతమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇప్పుడు ఆరంభమైన ఈ ఐక్యత ఇకపై కూడా కొనసాగుతుందని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం హామీ ఇచ్చారు.