Tuesday, November 19, 2024

2024లో మోడీ పాలనకు చరమగీతం : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె .రామకృష్ణ

తిరుపతి సిటీ ప్రభ న్యూస్ : కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం ఫాసిస్టు, నియంతృత్వ ధోరణులను అవలంభిస్తోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా ధ్వ‌జమెత్తారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడకుండా ఉక్కు పాదం మోపి ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తోందని విమర్శించారు. తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. పార్లమెంటులో ఎటువంటి చర్చ జరగకుండా మూడు సాగు చట్టాలు తీసుకువచ్చారని, చివరకు రైతులు చేసిన ఉద్యమానికి దిగిరాక తప్పలేదన్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్న సంకేతాలు రావడంతో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు.

మోడీకి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ లో బలమైన వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. బిజెపి హయాంలో దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు దళితులు మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు. ప్రజల కష్టాలను పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలను రూపొందిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలను పార్లమెంట్ వ్యవస్థను మోడీ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని ప్రైవేట్ పరం చేయడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నారని ప్రైవేటీకరణ చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. మోడీ ప్రభుత్వానికి 2024లో చరమగీతం పాడేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు అన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అక్టోబరు లో 24 వ సిపిఐ జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతున్నాయని చెప్పారు. దేశం మొత్తం ఈ మహాసభల వైపు చూస్తోందని, ఈ మహాసభలలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించ పోతున్నామని పేర్కొన్నారు. అమరావతి పై జగన్మోహన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధానిగా ఉండాలని మొట్టమొదట సిపిఐ మాత్రమే తీర్మానం చేసిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్క కేంద్ర మంత్రి కూడా పర్యటించ కపోవడం శోచనీయం అన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె .రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తున్నారని, గంగవరం పోర్టును అధానికి అప్పగిస్తారని ధ్వజ మెత్తారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న వైసిపి కేంద్రం నుండి ఏమి సాధించిందని ప్రశ్నించారు. వరదల కారణంగా 1.50 కోట్ల మంది నిరాశ్రయులు అయ్యారని, 69 మంది మృతి చెందారని, లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్పారు. ఇంత జరిగినా కేంద్ర మంత్రులు పర్యటించక పోవడం, సాయం చేయకపోవడం, దీనిని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయక పోవడం దారుణం అన్నారు. వరద సాయంపై ఈ నెల 14, 15 తేదీల్లో ఢిల్లీకి సిపిఐ, రైతు సంఘం ప్రతినిధులు వెళ్తున్నట్లు తెలిపారు..ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు, చిత్తూరు జిల్లా కార్యదర్శి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి నదియ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement