ఈ మధ్యకాలంలో పోలీసులకు కొత్త కొత్త కేసులు వస్తున్నాయి. ఉన్న కేసులతోనే సతమతమవుతుంటే.. పిల్లి పారిపోయిందనో, బర్రె మేత మేయట్లేదనో.. పెన్సిల్ పోయిందనో.. ఇలా కొన్ని సిల్లీ కేసులు ఎదురవుతున్నాయి. తాజాగా కర్నాటకలోని హోలెహొన్నూర్ పోలీసులకు ఇలాంటి ఓ వింత కేసు ఎదురైంది. తన ఆవులు పాలివ్వట్లేదని ఓ రైతు కంప్లేంట్ చేశాడు. భద్రావతి తాలుకాలోని సిద్లిపురాకు చెందిన రామయ్య అనే రైతు ఈ మధ్య హోలెహొన్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ‘నేను నా నాలుగు ఆవులను రోజూ ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు.. సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు మేతకు తీసుకెళ్తాను. ఏమైందో తెలియదు కానీ నాలుగు రోజుల్నించి అవి పాలివ్వడం లేదు. పాలు పితకడానికి వెళ్తే తంతున్నాయి. మీరే ఎలాగైనా ఆవులు పాలిచ్చేలా చేయాలి.’ అని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
రామయ్య చెప్పింది విన్నాక పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇట్లాంటి కంప్లెయింట్స్ తాము స్వీకరించలేమని సున్నితంగా అతనికి నచ్చజెప్పారు. దీంతో రామయ్య విచారంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మధ్యనే మధ్యప్రదేశ్‌లోనూ ఇట్లాంటి ఘటన జరిగింది. తన బర్రెలకు ఎవరో చేతబడి చేశారని… అప్పటినుంచి అవి పాలివ్వట్లేదని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏకంగా ఆ గేదెలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే.. దానికి తామేమీ చేయలేమని… పశు వైద్యుల వద్దకు వెళ్తే ఫలితం ఉంటుందని పోలీసులు చెప్పారు. దీంతో అక్కడి నుంచి పశు వైద్యుల వద్దకు వెళ్లాడు. ఆ మరుసటిరోజు నుంచి తన గేదెలు పాలివ్వడంతో సంతోషించాడు. ఇదే విషయాన్ని మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో చెప్పొచ్చాడు.