మే 1 నుండి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని బట్టి వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారా, డబ్బు చెల్లించాలా అన్నది ఆధారపడి ఉంది. అయితే మే 1 నుండి వ్యాక్సిన్ సెంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు కోవిన్ యాప్‌లో ఏప్రిల్ 24 నుండే రిజిస్టర్ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటి వరకు ఎలాగైతే ఆధార్ కార్డు వంటి ప్రూఫ్ చూపి వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్నారో అలాగే ప్రాసెస్ ఉంటుందని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ ఎస్ శర్మ ప్రకటించారు.
ఇప్పటికే ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్‌కు తోడుగా రష్యన్ స్పుత్నిక్ వీ టీకాలను కూడా కొన్ని సెంటర్లలో చేర్చుతున్నట్లు తెలిపారు. అంతేకాదు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రైవేటు ఆసుపత్రులను వ్యాక్సిన్ సెంటర్స్ జాబితాలో చేర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. అనుమతి లభించిన ప్రైవేటు ఆసుపత్రులు తమ వ్యాక్సినేషన్ టైంను యాప్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.