కరోనా కట్టడిలో మరో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నేటి నుంచి దేశంలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 18 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇప్పుడు తొలిసారిగా 15 నుంచి 17 ఏళ్ల వయస్సువారికి కరోనా టీకాలు ఇవ్వనున్నారు.
గత ఏడాది డిసెంబర్ 25న చిన్నారుల వ్యాక్సినేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిన్‌లో యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తొలిడోసు, రెండవ డోసుకు మద్య 28 రోజుల గ్యాప్ ఇస్తున్నారు. చిన్నారుల వ్యాక్సినేషన్ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కోవాగ్జిన్ ఇవ్వనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సులో చిన్నారులు పది కోట్ల మంది ఉండవచ్చని తెలుస్తోంది. విద్యార్థులు తమ విద్యార్థి గుర్తింపు కార్డులను ఉపయోగించి పోర్టల్‌లో టీకా కోసం నమోదు చేసుకోవచ్చు.