కరోనా థర్డ్ వేవ్ ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాగాన్ని కూడా ఆందోళనకు గురిచేసింది. అయితే ఆగ్రాలో సెకండ్ వేవ్ తర్వాత UP ప్రభుత్వం నిర్వహించిన విస్తృతమైన టీకా కారణంగా వైరస్‌ని ఎదుర్కోవడంలో ప్రజలు కావాల్సిన ఇమ్యూనిటీని పొందారు. థర్డ్ వేవ్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో దాదాపు 99 శాతం మంది కేవలం ఒక వారంలోపు మాత్రమే ఇంట్లో ఉండి త్వరగా కోలుకున్నారు. అంతేకాకుండా కొవిడ్ మార్గదర్శకాలను ప్రజలు ఈసారి కొంచెం చిత్తశుద్ధితో పాటించారని, ఇది వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడిందని సీనియర్ డాక్టర్ ఎస్ కె కల్రా అన్నారు.
అలాగే, జనాభాలో దాదాపు 80 శాతం మందికి టీకాలు వేశామని, డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఓమిక్రాన్ చాలా బలహీనంగా ఉందని డాక్టర్ కల్రా చెప్పారు. దీని ఫలితంగా ఆగ్రాలో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయినట్టు రికార్డుల్లో నమోదైందని వివరించారు. ఆగ్రాలో థర్డ్ వేవ్‌లో కరోనా బారినపడ్డ వారి సంఖ్య అధికారికంగా 9,502 అని, అందులో 65 మంది మాత్రమే హాస్పిటళ్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. వీరిలో 59 మంది ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీ, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఇంట్లోనే చాలామంది రికవరీ అయ్యారు. దీనికి టీకాలు ఎంతో దోహదపడ్డాయి. వైరస్ సోకిన వారిలో 40 శాతం మంది తేలికపాటి దగ్గు, జలుబు, గొంతు నొప్పి. తేలికపాటి జ్వరం వంటివి ఉన్నట్టు కంప్లెయింట్ చేశారని, కేన్సర్, టీబీ, శ్వాసకోశ, గుండె జబ్బులు వంటి తీవ్రమైన జబ్బులు ఉన్నప్పటికీ చాలా మంది ఏడు రోజుల్లోనే కోలుకున్నట్టు తెలిపారు.
అగ్రా జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ సంజీవ్ బర్మన్ మాట్లాడుతూ 15-18 ఏళ్లలోపు 6,148 మంది యువకులకు ఇవ్వాల (బుధవారం) మొదటి డోస్ వేసినట్టు తెలిపారు. మొదటి షాట్ తర్వాత 28 రోజులు పూర్తయిన తర్వాత కొంతమందికి రెండో డోస్ కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. ఇంతకుముందు వ్యాధి సోకిన వారు, ఆ తర్వాత టీకాలు వేసిన వారి రక్తంలో 300 రోజుల తర్వాత కూడా 500-700 యూనిట్లు/మిలీ యాంటీబాడీలు ఉన్నాయని SN మెడికల్ కాలేజీ మెడికల్ ట్రాన్స్ ఫ్యూజన్ విభాగం అధిపతి డాక్టర్ నీతు చౌహాన్ చెప్పారు. వ్యాధి సోకని, కేవలం టీకాలు వేసిన వారి రక్తంలో 200 యూనిట్లు/ml యాంటీబాడీలు ఉన్నాయన్నారు. ఇవి ఇన్ఫెక్షన్ నుండి తగిన రక్షణను అందించడానికి సరిపోతాయని తెలిపారు. కొవిడ్ థర్డ్ వేవ్ బలహీనపడినప్పటికీ ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని, మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.