Saturday, November 23, 2024

నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన కరోనా వైరస్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిరుద్యోగం మళ్లీ పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, ఆంక్షలతో ఉద్యోగాల్లో కోతలు పడుతున్నాయి. పెద్ద సంఖ్యలో పలువురు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. కరోనా ప్రభావం కారణంగా జాతీయ స్థాయిలో గత మూడు వారాల్లోనే నిరుద్యోగ రేటు ఒకశాతం పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఈఐ) వెల్లడించింది. వలస కార్మికులు, పట్టణ కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోతుండటంతో ఆ ప్రభావం పలు రంగాలపై పడుతోందని సీఎంఈఐ అభిప్రాయపడింది. మూడు వారాల క్రితం అంటే మార్చి 28న నిరుద్యోగ రేటు 6.65 శాతం ఉండగా.. ఏప్రిల్‌ 18 నాటికి 8.40 శాతానికి పెరిగింది.

పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు మూడు వారాల కిందట 7.72 శాతంగా ఉంటే ఇప్పుడు 10.72 శాతానికి పెరిగింది. అటు గ్రామీణ ప్రాంతాల్లో 6.18 శాతం నుంచి 7.31 శాతానికి చేరింది. నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో హర్యానా (28.1 శాతం), గోవా (22.1 శాతం), రాజస్థాన్ (19.7 శాతం), బీహార్ (14.5 శాతం), జార్ఖండ్ (12.8 శాతం) ఉన్నాయి. దేశంలోని కీలకమైన నగరాలు, పట్టణాల్లో ఆంక్షలు, నైట్‌ కర్ఫ్యూలు ఎక్కువ కాలం కొనసాగితే మళ్లీ గ్రామాలకు వలసలు మొదలవుతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో మార్చిలో నిరుద్యోగ రేటు 3.8 శాతం ఉండగా.. ప్రస్తుతం మరింత పెరుగుతోందని నిపుణులు అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement