ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. వైరస్ కట్టడి కోసం ఇప్పటికే ఒడిశా సర్కార్ లాక్‌డౌన్ అమలు చేస్తోంది. పసికందుల నుంచి పండు ముసలివాళ్ల వరకూ ఎంతోమంది కరోనా బారిన పడుతున్నారు. అయితే, తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో నెలన్నర వయసున్న ఓ పసికందు కరోనాను జయించడం విశేషం. ఓ ఆస్పత్రిలో గత 10 రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న పసికందు ప్రస్తుతం పూర్తిగా కోలుకుందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పసికందుకు చికిత్స చేసిన డాక్టర్ అర్జిత్ మోహపాత్రా ట్విట్టర్ లో తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని కలహండి జిల్లాకు దంపతులకు మార్చి 22న ఆడబిడ్డ జన్మించింది. బిడ్డకు గుడియా అని నామకరణం చేశారు. ప్రసవం తర్వాత ఇంటికి వెళ్లిన కొద్దిరోజులకే ఆ పసికందుకు జ్వరం మొదలైంది. పాలు కూడా సరిగా తాగలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే దంపతులు కరోనా బారిన పడ్డారు. అయితే, పాప శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తల్లి గుర్తించింది. వెంటనే పీడియాట్రిక్ స్పెషలిస్టు వద్దకు తీసుకెళ్లింది. పాపకు అక్కడ వైద్య పరీక్షలు చేయగా కోవిడ్ న్యుమోనియా ఉన్నట్లు తేలింది. ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటిల్ వచ్చినట్లు గుర్తించారు. వైద్యుడి సలహా మేరకు వెంటనే ఆ పసికందును భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ డా.అరిజిత్ మోహాపాత్ర ఆ శిశువుకు చికిత్స అందించారు. ఆ శిశువును తమ ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు అప్పటికే తను తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యుడు అరిజిత్ చెప్పారు. శిశువును చివరకు వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేసి చికిత్స చేశామన్నారు. చికిత్సలో భాగంగా రెమ్‌డిసివిర్‌తో పాటు అవసరమైన యాంటీ బయాటిక్స్ కూడా ఇచ్చినట్లు వివరించారు. తమ ప్రయత్నాలు ఫలించి 10 రోజుల్లో శిశువు కోలుకుందని వైద్యుడు చెప్పారు.
కాగా, ఒడిశా రాష్ట్రంలో ఆకస్మాత్తుగా కరోనా కేసుల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. శుక్రవారం కరోనా కేసుల సంఖ్య 12,390 గా నమోదైంది. కరోనాతో 22 మంది మరణించారు. కరోనా రోగుల్లో 6,938 మంది క్వారంటైన్ లో ఉన్నారు. ఒడిశాలో మొత్తం 5,88,687 కరోనా కేసులు నమోదు కాగా, 2,273 మంది మరణించారు.
ఇది కూడా చదవండి: సరిహద్దులో అంబులెన్స్ లకు లైన్ క్లియర్