Friday, November 22, 2024

రాష్ట్రంలో ఫోర్త్‌ వేవ్‌ టెన్షన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: థర్డ్‌ వేవ్‌తో కరోనా కథ ముగిసిందని భావిస్తున్న తరుణంలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్స్‌ అటు ప్రజలను, ఇటు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖను టెన్షన్‌ పెడుతున్నాయి. కరోనా ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ప్రపంచంలోని చైనా, బ్రిటన్‌ తదితర దేశాలతోపాటు దేశంలోని ఢీల్లి, మహారాష్ట్ర ప్రాంతంలోనూ వేగంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఈ-2 ను పొరుగున్న ఉన్న మహారాష్ట్రలోనూ గుర్తించారు. దీంతో తెలంగాణలో మరోసారి కొవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ తప్పదని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోసారి దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసులు పెరగడం వెనక ఫోర్త్‌ వేవే కారణమని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లి సహా పలు రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడంతో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అప్ర మత్తమైంది.

ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించే విధంగా మరోసారి నిబంధనలను అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆరుబయట, జనసమ్మర్థ ప్రాంతాల్లో మాస్కు పెట్టుకోవాలన్న నిబంధనను మళ్లి అమలు చేయాలన్న యోచనలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నట్లు తెలిసింది. ఫోర్త్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జనవరి మూడోవారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్త‌తం రాష్ట్రంలో రోజూ కేవలం 15లోపు మాత్రమే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ తీవ్రత తక్కువగానే ఉన్నా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ మెరుగ్గా పంపిణీ జరిగిందని, దాదా పు అర్హులైన అందరూ రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ తీసుకున్నందున ఫోర్త్‌ వేవ్‌ తెలంగాణపై అంతగా ప్రభావం చూపకపోవచ్చంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement