దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఎక్కువ మందికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇకపై కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వర్క్ ప్లేస్‌లలోనూ(ప్రభుత్వ, ప్రైవేట్) అనుమతించనుంది. పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్ సంస్థలన్నీ కూడా ఈ నెల 11వ తేదీలోగా ‘వర్క్ ప్లేస్ వ్యాక్సినేషన్’ ప్రక్రియ కోసం ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
కాగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలైన మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇండియాలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రెండో వేవ్ ఉద్ధృతంగా సాగుతున్నందున మంగళవారం నాడు ఏకంగా 1,15,249 కొత్త కేసులు వచ్చాయి. ఇదే సమయంలో 630 మంది ప్రాణాలను కోల్పోయారు. ఒక్క మహారాష్ట్రలోనే 55,469 కొత్త కేసులు వచ్చాయి.