దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా అందజేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రాష్ట్రాలు నేరుగా టీకా తయారీ సంస్థల వద్దే వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతుగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ టీకాకు దూరం కావొద్దని భావించిన కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని నిర్ణయించాయి. అలా ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.
18 ఏళ్లు పైబడని వారందరికీ ఉచితంగా టీకా అందిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కార్యాలయం బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించింది. సీఎం అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ సైతం తమ పౌరుల టీకా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం భూపేశ్ బఘేల్ ప్రకటించారు.
18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా టీకా వేస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం.. ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా వైరస్ ఓడిపోతుంది.. భారతదేశం గెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.
మే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృత స్థాయిలో అందరికీ వర్తించేలా ఉంటుందని తెలిపింది. మూడో దశ వ్యాక్సినేషన్ వ్యూహంలో భాగంగా దేశంలోని వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు కేంద్ర ఔషధ ప్రయోగశాల విడుదల చేసిన డోసుల్లో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 50 శాతం డోసులను వారు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌కు ఇవ్వొచ్చని ప్రభుత్వం ఆదేశించింది.