గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 800 దాటడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం దేశంలో కొత్తగా 841 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి చేరింది. దేశంలో తాజాగా మొత్తం కేసుల సంఖ్య 4,46,94,349కి చేరాయి. ఇప్పటి వరకు 4,41,58,161 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.80శాతం ఉండగా.. మరణాల రేటు 1.19శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 220.64 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. దేశంలో సగటు రోజువారీ కొవిడ్ కేసులు నెలలో ఆరురెట్లు పెరిగాయి. సగటు రోజువారీ కొత్త కేసులు నెల కిందట ఫిబ్రవరి 28న 112 కేసులున్నాయి. ఇప్పటి 800కు చేరాయి. మరో వైపు పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరు రాష్ట్రాలకు ఆరోగ్యశాఖ లేఖ రాసింది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు లేఖ రాసింది. పరీక్షలు, చికిత్స, ట్రాకింగ్, వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని సూచించింది.