Tuesday, November 26, 2024

పిల్లల్లో కరోనా లక్షణాలు ఎలా గుర్తు పట్టాలి?

కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ లో దేశం అతలాకుతలం అవుతోంది. మొదటి దశలో కంటే రెండో దశలో కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దేశంలో థర్డ్‌ వేవ్‌ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మూడో దశలో చిన్న పిల్లలు వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుని పిల్లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

కరోనాకు చిన్న, పెద్ద అనే తేడా లేదు. పిల్లల్లో కూడా కరోనా వ్యాప్తి ఉంది. పెద్దల్లో అయితే దగ్గు, జలుబు, ఆయాసం కొన్ని సందర్భాల్లో గుండె పోటు, పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయి. పిల్లల్లో అయితే ఎక్కువగా వాంతులు, విరేచనాలు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. పిల్లల్లో లక్షణాలు ఉండి పరీక్షల్లో నెగెటివ్‌ ఉంటే రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. సీబీపీ, సీఆర్‌పీలో ఏమైనా తేడాలు ఉంటే, వైరస్‌ వస్తే మనకు తెలిసిపోతుంది.

పిల్లల్లో వాంతులు, విరేచనాలు, జ్వరం, దగ్గు, జలుబు, కడుపునొప్పి మూడు రోజుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆక్సిజన్‌ స్థాయి 94 కంటే తక్కువగా ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. కళ్లు ఎర్రగా మారడం, ఒళ్లంతా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్సలు పొందాలి. కరోనా సోకకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండి అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. వాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చేదాకా పిల్లలను బయట తిరగనీయకూడదు. బయటికి వెళ్తే మాస్కు లు తప్పకుండా పెట్టాలి. చేతులను శుభ్రంగా శానిటైజ్‌ చేసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించే విధంగా చూడాలి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement