కరోనా టీకా కొవాగ్జిన్ ధరను తగ్గించినట్లు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. రాష్ట్రాలకు రూ. 400కే కొవాగ్జిన్ టీకా డోసును సరఫరా చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. గతంలో టీకా డోసును రూ. 600గా నిర్ధారించిన భారత్ బయోటెక్.. దాన్ని రూ. 200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు కొవిషీల్డ్ టీకా ధరను తగ్గిస్తూ సీరం సంస్థ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రూ. 400గా ఉన్న కొవిషీల్డ్ టీకా ధరను రూ. 300కు తగ్గించింది.
ఇటీవల భారత్ బయోటెక్ చేసిన ప్రకటన ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికికైతే రూ.150లకు, రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.600లకు, ప్రైవేటు దవాఖానలకైతే రూ.1200లకు టీకా విక్రయిస్తామని తెలిపింది. టీకాను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ప్రకటనలో పేర్కొన్నది. ఎగుమతి చేసే టీకా ధర రూ.1,100-రూ. 1,500 మధ్య ఉంటుందని తెలిపింది. తాము ఉత్పత్తి చేసే మొత్తం టీకాల్లో సగం కంటే ఎక్కువ కేంద్రప్రభుత్వానికి రిజర్వ్ చేస్తామని, వాటిని ప్రస్తుతం ఉన్నట్టుగా రూ.150కే అందజేస్తామని స్పష్టం చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో తాజాగా టీకా ధరను భారత్ బయోటెక్ కొంత మేర తగ్గించింది.