Friday, November 22, 2024

తెలంగాణలో సరిపడా ‘కొవాగ్జిన్’ డోసులు లేవట

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌లకు కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో సరిపడా ‘కొవాగ్జిన్’ డోసులు లేవని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు 4.5లక్షల కొవాగ్జిన్ డోసులు రాగా తొలి డోసు కింద 2.5లక్షలను వినియోగించామని సదరు అధికారి చెప్పారు. సెకండ్ డోసు వేయించుకునే వారి కోసం మిగతా వాటిని నిల్వ చేశామని, కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలియదని పేర్కొన్నారు. ఎక్కువగా కొవిషీల్డ్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది.

కాగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ వెనుకబడి ఉంది. అయితే ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా ఇస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మాత్రం తెలంగాణ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం.. తెలంగాణలో మొత్తం కోవిడ్-19 వ్యాక్సిన్‌ల మోతాదులో 48.39 శాతం ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా ఇస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ప్రభుత్వం 11,578 కరోనా వ్యాక్సిన్‌లు ఇవ్వగా దేశంలో 24వ స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement