మనస్పర్థలతో విడిపోవాలనుకున్న ఓ జంటకు కోర్టు మళ్లీ పెళ్లి చేసి వారి బంధాన్ని నిలబెట్టిన సంఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని జయపురంలోని బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీలోని పాత్రపుట్ గ్రామానికి చెందిన ఫల్గుణి-అనిత భార్యాభర్తలు. 2016లో వీరి వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు వీరి వైవాహిక బంధం సాఫీగానే సాగింది. ఆ తర్వాత వీరిమధ్య కలతలు పొడసూపాయి. దీంతో ఇక కలిసి ఉండలేమని భావించి 2018లో విడాకుల కోసం కోర్టుకెక్కారు. వారికి అప్పటికే ఏడాది వయసున్న కుమార్తె ఉంది.
నిన్న జయపురం కోర్టులో జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో కేసు విచారణకు వచ్చింది. విడాకులు కోరడం వెనకున్న కారణాలు తెలుసుకుని విడాకులు మంజూరు చేయడమో, లేదంటే కుదరదని చెప్పడమో చేయాల్సిన కోర్టు వారిద్దరికీ కోర్టులో మళ్లీ పెళ్లి జరిపించి మనస్పర్థలను పటాపంచలు చేసింది. కేసు వాదించిన న్యాయవాది మున్నాసింగ్ వైవాహిక బంధంలోని గొప్పతనాన్ని వివరించారు. మనస్పర్థల కారణంగా దూరమైన వారిని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారు. ఇద్దరినీ ఒప్పంచి అక్కడే వారిద్దరికీ వివాహం జరిపించి విడిపోవాల్సిన జంటను ఒక్కటి చేశారు.
ఇది కూడా చదవండి: ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పకోనున్న విరాట్ కోహ్లీ