వరదలతో నిండిన వీధిలో స్కూటీపై వెళుతున్న ఓ జంట తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని కిషన్‌పూర్‌లో జరిగింది. ఈ వీడియోలో స్కూటీపై ఒక జంట కాలిబాట పక్కన పార్క్ చేయడానికి వరద నీరు ఉన్న వీధి గుండా వెళుతుండగా, వాహనం, దానిపై ఉన్నవారు ఒక మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. అంతలోనే అక్కడ ఉన్న చాలామంది వారికి సహాయం చేయడానికి పరుగెత్తడం కనిపిస్తుంది. వారిని సురక్షితంగా ఆ మ్యాన్‌హోల్ నుంచి బయటికి తీశారు కానీ, స్కూటీ మాత్రం కనిపించడం లేదు.
ఈ ఘటనలో బాధితులు యూపీ పోలీసు అధికారి దయానంద్ సింగ్ అత్రి , అతని భార్య అంజు అత్రిగా గుర్తించారు. వారిద్దరూ డాక్టర్ని చూడటానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ‘‘నా ముందున్న రహదారి వరద నీటితో ఉంది. నేను ఆ గొయ్యిని చూడలేక అందులో పడిపోయాను” అని దయానంద్ సింగ్ అత్రి తెలిపారు.
వర్షాకాలంలో ఈ ప్రాంతంలో రోడ్లు తరచూ జలమయం అవుతుంటాయి.. ఫలితంగా గతంలో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ గొయ్యి గతంలో అనేక ప్రమాదాలకు మూలమైనప్పటికీ, మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకోవడం లేదని అంబులెన్స్ డ్రైవర్ వినోద్ కుమార్ చెప్పారు. అయితే ఈ ప్రమాదంపై తెలంగాణలోని చాలామంది రియాక్ట్ అవుతున్నారు. డబుల్ ఇంజిన్ ఇంపాక్ట్ అంటే ఇట్లనే ఉంటదా? డబుల్ ఇంజిన్ డెవల్ మరీ ఇంత ఘోరంగా ఉంటదా అని కామెంట్స్ చేస్తున్నారు.