Saturday, November 23, 2024

Telangana: కౌంట్‌డౌన్ షురూ.. తెల్లారితే మునుగోడు పోలింగ్

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఆశక్తి రేకెత్తించిన తెలంగాణ రాజకీయాల కొన్ని నెలల నిరీక్షణకు నేడు తెరపడనున్నది. సాధారణ ఎన్నికల తరహాలో సాగిన ఉప ఎన్నిక అన్ని పార్టీల్లో పొలిటికల్‌ హీట్‌ పెంచింది. 2023 సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తూ ఈ ఒక్క సీటు కోసం అన్ని ప్రధాన పార్టీలూ శక్తివంచన లేకుండా శ్రమించాయి. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లి ఎన్నికలు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రాజకీయాలకు కీలకమని భావిస్తున్న ప్రధాన పార్టీలు గెలుపుకోసం అహరహం శ్రమించి చేయాల్సిందంతా చేశాయి. మునుగోడులో ఓటర్లు కూడా దేశంలో ఎక్కడాలేని రీతిలో ఓట్ల నమోదు మొదలుకొని ఓటుకింతేనా అనే డిమాండ్‌ వరకు కొత్త చరిత్రను లిఖించిన ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉదయం 7గంటలకు పోలింగ్‌తో మొదలై సాయంత్రం 6గంటలకు ముగియనుంది.

సాయంత్రం 6 లోగా పోలింగ్‌ కేంద్రాలలోపలికి చేరుకున్న ఓటర్లను ఎంత లేటైనా ఓటింగ్‌కు అనుమతించేలా ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 90శాతంపైగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇందుకు పకడ్బంధీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం 3366 మంది రాష్ట్ర పోలీసులతోపాటు 15 కంపెనీల కేంద్ర బలగాలతో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సకల జాగ్రత్తశలలు తీసుకున్నది. ఈ ఉప ఎన్నికలో సీ విజిల్‌ యాప్‌తోపాటు, ప్రతీ కేంద్రంనుంచి వెబ్‌ క్యాస్టింగ్‌, ఓటింగ్‌ యాప్‌ ద్వారా ప్రతీ గంటగంటకూ నేరుగా పోలింగ్‌ కేంద్రాలనుంచి ఓటింగ్‌ శాతం నమోదుకు చర్యలు తీసుకున్నారు.

నియోజకవర్గంలో 298 పోలింగ్‌ కేంద్రాలుండగా, 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. పోలింగ్‌కు గంట ముందుగా మాక్‌ పోలింగ్‌ను నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకే పోటీలో ఉన్న అభ్యర్ధులకు చెందిన పోలింగ్‌ ఏజెంట్లు చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తం 1492 మంది పోలింగ్‌ సిబ్బందిని ఎన్నికల సంఘం సిద్దం చేయగా, ఇందులో 300మంది రిజర్వులో ఉండనున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక్కో మైక్రో అబ్జర్వర్‌ను ఎన్నికల సంఘం నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement