Monday, November 18, 2024

ప‌త్తి ఢ‌మాల్ – ప‌సుపు జిగేల్….

హైదరాబాద్‌, : పత్తికి గిట్టుబాటు రేటు దక్కకపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కారు. మరోవైపు ఇందూరు రైతులు పసుపుధర రికార్డు స్థాయిలో పెరగడంతో.. మంగళవారం పండుగ చేసుకున్నారు. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో వారం క్రితం వరకు 7వేలు ఉన్న పసుపుధర ఇపుడు పదివేలకు పెరగడంతో.. అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫింగర్‌ రకం 10,188 ధర రాగా, 9,129 క్వింటాల్‌ మార్కెట్‌కు వచ్చింది. గత కొంతకాలంగా పసుపురేటుపై రైతుల్లో ఆందోళన ఉండగా, ఇపుడు మంచి ధర వస్తుండడంతో ఆనందం నెలకొంది. గిట్టుబాటు ధర కోసం పత్తి రైతులు పలు చోట్ల ఆందోళనలు చేశారు. మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలంటూ పెద్దపల్లి మార్కెట్‌ యార్డు ఎదుట మంగళవారం పత్తి రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌ పత్తికి రూ.5,900 ఉందని వారు పేర్కొన్నారు. కానీ వ్యాపారులు మాత్రం రూ.4,200 లకే క్వింటాల్‌ పత్తిని కొనుగోలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్తంభిం చింది. దాదాపు వంద మందికిపైగా పత్తి రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించా రు. పలు జిల్లాల్లోనూ ఈ తరహా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈసారి తెలం గాణ వ్యాప్తంగా పత్తిని విస్తారంగా వేయగా, దళారులు రంగప్రవేశం చేయడంతో కనీస మద్దతుధర కూడా లభించని పరిస్థితి నెలకొంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి సాగు మొదలు పెట్టిన నాటినుండి రైతులు తీవ్ర కష్టాలు పడ్డారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం బాగా జరిగింది. దీంతో ఆశించిన స్థాయి దిగుబడులు రాకపోగా, ఎకరాకు 6-7 క్వింటాళ్ళు మాత్రమే దక్కింది. మార్కెట్‌ యార్డుల్లో క్వింటాల్‌కు రూ.4,500 ధర కూడా రావడం లేదు. దీంతో రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. దేశీయమా ర్కెట్లో పత్తికి డిమాండ్‌ ఉన్నా.. స్థానిక మార్కెట్లలో మాత్రం ధర దక్కడం లేదు. దీంతో కరీంనగర్‌, వరంగల్‌ తో పాటు పలు జిల్లాల్లో తరచూ రైతులు ధర కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సిసిఐ ముందుకు రాకపోవడంతో చాలా ప్రాంతాల్లో రైతులు దారుణంగా నష్టపోయారు. అసలే దిగుబడులు తక్కువ కాగా, ధర కూడా ఆశించిన స్థాయిలో దక్కడం లేదని రైతులు నిరసనలకు దిగుతున్నారు. ఇపుడే పరి స్థితి ఇలా ఉంటే.. ఇక మార్కెట్లు లేకుండా కొత్త వ్యవసాయచట్టాలు అమలు జరిగితే తమ పరిస్థితి భయానకంగా ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement