- తూ తూ మంత్రంగా విచారణ
- ఉన్నతస్థాయి అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణ
- ఆంధ్రప్రభ ఎఫెక్ట్
మార్కాపురం రూరల్, ప్రభన్యూస్ : మండలంలోని గజ్జలకొండ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో హెచ్‌విడిఎస్ పథకం ద్వారా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన లైన్మెన్ పోలయ్యపై బదిలీ వేటు పడింది. రైతుల నుండి రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు పక్కా ఆధారాలతో విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలాలు శీర్షికని శనివారం ఆంధ్రప్రభలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై విద్యుత్ ఎడిఇ కె. శ్రీనివాస్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఈ విచారణలో అక్రమ వసూళ్లు వాస్తవమని తేలింది. రైతులు కొందరు లిఖిత పూర్వకంగా అదనంగా వేలల్లో వసూలు చేశారని, లైన్మెన్ పోలయ్యకు నగదును ఫోన్ పే ద్వారా చెల్లింపులు కూడా చేసినట్లు ఆరోపించారు. ఈ విచారణలో లైన్మెన్ పోలయ్య ఒక్కరినే బాధ్యులుగా చేశారు.
లైన్మెన్ పోలయ్య అక్రమ వసూళ్లకు పాల్పడినా ట్రాన్స్ఫార్మర్ మంజూరు వంటి విషయాలు అతని స్థాయిలో జరిగే ప నులు కావని ఈ తతంగం వెనుక ఆ శాఖ మార్కాపురం డివిజన్ ఉన్నతాధికారులు ఉన్నారనేది వాస్తవం. విచారణాధికారి కూడా ఇందులో పాత్రదారుడేనన్న ఆరోపణలు లేకపోలేదు. స్థానిక అధికారులతో కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన అధికారులతో విచారణ చేపడితే ఎవరెవరు ఎంత మేర తీసుకున్నారనే వాస్తవాలు వెలుగులు లోకి వచ్చేవి. విద్యుత్ శాఖలో జరిగిన ఈ విచారణ దొంగ చేతికి తాళం అందించి న ట్లుగా ఉందని ప్రజలు, రైతులు విమర్శిస్తున్నారు. ఒక్క గజ్జలకొండ గ్రామంలోనే రూ. 31 లక్షలు అక్రమ వసూళ్లకు పాల్పడడం జరిగింది. ఇందుకు లైన్మెన్ పోలయ్యను బాధ్యులుగా చేస్తూ అతనిని చీరాల డివిజన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.