Wednesday, November 20, 2024

అవినీతి రహిత భారతే లక్ష్యం.. మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోడీ

అవినీతి అనేది చెద పురుగులాంటిందని, అది దేశాన్ని నాశనం చేస్తుందని, యువత ముందుకు వస్తే.. దాన్ని వీలైనంత త్వరగా అంతం చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విధులకు ప్రాధాన్యత ఇవడం.. కర్తవ్యమే మొదటి ప్రాధాన్యతగా ఉన్న చోట అవినీతికి చోటు ఉండదన్నారు. 85వ మన్‌ కీ బాత్‌ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశిస్తూ.. ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ ఏడాదిలో తొలి మన్‌ కీ బాత్‌ అని గుర్తు చేశారు. అవినీతిని తరిమికొట్టడానికి ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి విషయంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక రాసిన పోస్టు కార్డులోని విషయాన్ని ప్రస్తావిస్తూ.. 2047 నాటికి అవినీతి రహిత భారత్‌ చూడాలని తాను కలలు కంటున్నాని ఆ బాలిక రాసినట్టు తెలిపారు. అవినీతి అనే ఈ చెద నుంచి బయటపడటానికి 2047 వరకు ఎందుకు ఆగాలని ప్రశ్నించారు. దేశ ప్రజలు.. యువత కలిసికట్టుగా చేయాల్సిన పని ఇది అని, ఈ కృషిని సాధ్యమైనంత త్వరగా చేపట్టాలన్నారు. కర్తవ్య భావన ఉన్నప్పుడు.. కర్తవ్యమే అత్యున్నతమైనది అయినప్పుడు అవినీతి ఉండదని అభిప్రాయపడ్డారు.

అమర జవాన్‌ జ్యోతి విలీనం చేయడాన్ని హర్షిస్తూ.. ఎంతో మంది మాజీ సైనికులు తనకు లేఖ రాశారని ప్రధాని చెప్పారు. జాతీయ యుద్ధ స్మారకంలో అమర జవాన్‌ జ్యోతిని విలీనం చేసి అమరులకు ఘన నివాళి ఇచ్చినట్టు అయ్యిందని లేఖలో పేర్కొన్నట్టు మోడీ తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రకటించిన బాల పురస్కారాలు, పద్మ అవార్డులను సామాన్యులకు ప్రదానం చేయడాన్ని ప్రశంసించినట్టు తెలిపారు. అమర జవాన్‌ జ్యోతి విలీనం జరిగిన యుద్ధ స్మారకాన్ని ప్రతీ ఒక్కరూ సందర్శించాలని ఈ సందర్భంగా కోరారు. జాతిపిత మహత్మా గాంధీ పుణ్యతిథి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్నారు. నివాళి అర్పించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కజేయకుండా పోరాడి.. గుర్తింపు లేకుండా పోయిన వీరులను స్మరించుకుంటున్నామని చెప్పారు. జాతిపిత ఆదర్శాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.

కోటి మందికి పైగా పిల్లలు తమ మన్‌ కీ బాత్‌న పోస్టు కార్డుల ద్వారా పంపించారని మోడీ తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఈ పోస్టు కార్డులు దేశ భవిష్యత్తుపై నవతరానికి ఉన్న దృక్పథాన్ని తెలుపుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆ ఉత్తరాల్లో ఎంపిక చేసిన కొన్నింటి సారాంశాన్ని ప్రధాని మోడీ చదివి వినిపించారు. ఈ లేఖలు రాసిన వారంతా అవినీతి రహిత భారత్‌ను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అవినీతిని నిర్మూలించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మోడీ తెలిపారు. పద్మ అవార్డులు పొందిన బసంతీ దేవీ, లోరెంబమ్‌ బెయినో దేవితో పాటు పలువురు చేసిన కృషిని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారిని అన్‌సంగ్‌ హీరోలుగా అభివర్ణించారు. వారి సేవలను కొనియాడారు. దేశ జనాభాలో 75 శాతం మంది పెద్దలు కొవిడ్‌ వ్యాక్సిన్‌లు తీసుకున్నట్టు మోడీ తెలిపారు. కోటికి పైగా బూస్టర్‌ డోసులను కూడా అందుకున్నట్టు వివరించారు. ఇప్పటిదాకా నాలుగున్నర కోట్ల మంది 15-18 ఏళ్లలోపు పిల్లలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు. మహమ్మారి మూడో వేవ్‌తో దేశం విజయవంతంగా పోరాడుతోందన్నారు. ప్రతీ ఒక్కరు ప్రకృతిని ప్రేమించాలని, ప్రతీ జీవి పట్ల దయతో వ్యవహరించాలన్నారు. ఇది భారతీయ సంస్కృతిలో భాగమని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి అంగరక్షక దళంలోని అశ్వం విరాట్‌ వీడ్కోలును కూడా ప్రస్తావించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement