హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర అభివద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యాలుగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లపై తెలంగాణ సర్కార్ దృష్టిసారించింది. రాష్ట్రంలో నెలవై ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి నిర్దేశిత లక్ష్య సాధనలో విజయవంతమయ్యేలా నిధులు, నియామకాలతో చేయూత దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో గుదిబండలుగా మారి, నిరుపయోగంగా రాజకీయ పునారావాస కేంద్రాలుగా మారిన వీటిని ఆధణీకరించి అక్కరకు తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ రంగ పరిధిలోని సంస్థలను ఒక్కొక్కటిగా ఉపసంహరించుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించనున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా కేంద్రం ప్రైవేట్ కార్పొరేట్లకు ఆరాదత్తం చేస్తుండగా, తెలంగాణ సర్కార్ లాభాపేక్షతో కాకుండా సామాజిక అవసరాలే లక్ష్యంగా ప్రభుత్వ రంగ సంస్థల పునరుజ్జీవనానికి నడుం బిగించింది.
ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఏపీ పునర్వ్యవస్తీకరణ ట్టం-2014లోని షెడ్యూల్ 9కింద రాష్ట్రంలో 91 ప్రభుత్వ రంగ సంస్థలు(ఎస్పీఎస్యూ)లు ఉండగా వీటిలో మెజార్టీ కార్పొరేషన్లను ఉమ్మడి రాష్ట్రంలో నిర్వీర్యంగా మార్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసి వర్గాల నిరుద్యోగులకు రుణాలు, మార్జిన్ మనీ ఇచ్చి ఉపాధి చూపాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు, ట్రైకార్ల వంటివాటిని అప్పటి పాలకులు విస్మరించారు.
చేనేత వర్గాలను సముద్దరించేందుకు ఏర్పాటు చేసిన ట్రెస్కో, గీత కార్మికుల సంక్షేమానికి ట్యాడీ టాపర్స్ కో ఆపరేటివ్ కార్పొరేషన్, దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు, ఇతర పరికాలను అందించి చేయూతనివ్వల్సిన వికాలాంగుల అభివృద్ధి సంస్థ వంటి వాటిని నిర్వీర్యం చేశారు. ఇక నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి వంటి చర్యలతో ఒక వెలుగు వెలిగిన సెట్విన్, టీఎస్ ఫిల్మ్, అండ్ టెలివిజన్, ధియేటర్ డెవలప్మెంట్ కార్పొరేసన్లలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను ప్రభుత్వం సేకరించిందని తెలిసింది. రైతులకు హార్వెస్టర్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేసి అందించే ఆగ్రోస్, ఆహార పదార్థాలను తయారుచేసే టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ వంటివాటితోపాటు మిగిలిన కార్పొరేషన్లపై వివరాలు సేకరించినట్లుగా సమాచారం..
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో రెండు వర్గాలుగా ఉన్నాయి. స్వయంగా నిధుల సమీకరణతో నడిచే సెల్ఫ్ స్టెయినబుల్ సంస్థలు కొన్ని ఉండగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సర్వీస్‌లను అందించే (సర్వీస్ ఓరియెంటెడ్) సంస్థలు ఒంకొన్ని ఉన్నాయి. ఇందులో టీఎస్ఆర్టీసీ, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్, టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగరేణి వంటివి సెల్ఫ్ సస్టెయినబుల్ కార్పొరేషన్లుగా ఉన్నాయి. వీటిలోనూ కొన్ని సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. అయితే ప్రభుత్వం ప్రతీయేటా సామాజిక కోణంలో వాటిని ఆదుకుని నష్టాలను భర్తీ చేస్తోంది.
కాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక కార్పొరేషన్లు సుధీర్ఘకాలంగా పనిలేక వృధాగా ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలోనే వీటిని కుదించాలని అప్పటి కమిటీలు ఇరు రాష్ట్రాలకు సిఫార్సు చేశాయి. ఈ నేపథ్యంలో పనిలేక, పూర్తిగా నిర్వీర్యమై వృధాగా ఉన్నపలు కార్పొరేషన్లను ఇతర వాటిల్లో విలీనం చేయడం, లేదంటే మూసివేసి ఉద్యోగులను ఇతర సంస్థల్లో సర్దుబాటు చేసే యోచనకూడా పరిశీలనలో ఉన్నట్లుగా తెలిసింది. తద్వారా అనవసర వ్యయం తగ్గుతుందని, అవసరం ఉన్న సంస్థలకు నిధులను పెంచి ఈ ఉద్యోగుల సర్దుబాటుతో మరింత బలోపేతం చేయవచ్చనే ప్రతిపాదనలు కూడా సర్కార్‌కు చేరాయి.
దీంతో ఏటా రూ. 5నుంచి రూ. 10కోట్ల మేర వృథా వ్యయం తగ్గి పేదల సంక్షేమానికి, ఆయా వర్గాల అభ్యున్నతికి ఖర్చు చేయవచ్చని కూడా నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం దిశగా దృష్టిసారించిన సీఎం కేసీఆర్ స్వయం స్వావలంభనతో పనిచేస్తూ ప్రభుత్వానికి రాబడి, ప్రజా సంక్షేమానికి, పేదల అభ్యున్నతికి ఊతంగా మారిన పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఆయా కార్పొరేషన్లకు నిధులు, సిబ్బందిని కేటాయించారు. అవసరం ఉన్న కార్పొరేషన్లకు పునర్వైభవం తీసుకురావడంతోపాటు, అనవసరంగా ప్రభుత్వ ఖజానాకు వృధా ఖర్చులుగా మారిన కొన్నింటిపై త్వరలో స్పష్టమైన విధానం వెలువడనుందని తెలిసింది.
మచ్చుకు కొన్ని…
-స్టేట్ యోగాధ్యాయన పరిషత్
-స్టేట్ ట్రేడ్ ప్రమోసన్ కార్పొరేసన్
-స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేసన్
-స్టేట్ ఆగ్రోస్ డెవలప్మెంట్ కార్పొరేషన్
-స్టేట్ వేర్‌హౌజింగ్ కార్పొరేసన్
-స్టేట్ టెక్స్ టైల్స్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
-స్టేట్ అర్భన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
-తెలంగాణ ఫుడ్స్
2021 మార్చి నాటికి రాష్ట్రంలో 82 ప్రభుత్వ రంగ సంస్థలు ఉనికిలో ఉన్నాయి. ఇందులో 68 సంస్థలు పూర్తిగా యాక్టివ్‌గా ఉండగా, మిగిలిన అచేతనావస్థలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల వార్షిక టర్నోవరు తగ్గిన కారణంగా జీఎస్డీపీలో వీటి శాతం 8.36శాతంనుంచి 6.76శాఆనికి తగ్గింది. ఆయా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చాన రాయితీలు రూ. 5661కోట్లకు చేరాయి. మరోవైపు పూచీకత్తుగా రూ. 12,586కోట్లను ప్రభుత్వం రుణంగా ఇప్పించింది. ఇవి కేవలం విద్యుత్‌రంగ సంస్థలకుకాగా, మిగతా సంస్థలకు రూ. 32వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సాయంగా అందించింది.