Thursday, October 17, 2024

ఆధునిక హంగులతో కార్పొరేషన్ కార్యాలయం – పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం బ్యూరో : నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు రూ.21 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా నగర ప్రజలకు పౌర సేవలను చేరువ చేయాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు ఖమ్మం గట్టయ్య సెంటర్ లో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ భవనంను అసెంబ్లీ సమావేశాల అనంతరం పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. తుది దశకు చేరుకున్న భవన నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ పరిశీలించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక డిజైన్‌తో ఉద్యోగులు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు.

సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కార్యాలయ నిర్మాణ పనులు మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రిసెప్షన్ కౌంటర్, ఇంజనీరింగ్, మీ సేవ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ప్రహరీ, పార్కింగ్, గ్రీనరీ, టైల్స్, త్రాగునీటి వసతి, వెయిటింగ్ హాల్, పౌరుల వసతులు తదితర పనులను వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌన్సిల్ సమావేశాల నిమిత్తం 150 మంది కూర్చునేందుకు విశాలమైన పెద్ద హల్, డ్యుయల్ కుషన్ సీటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్ , సెంట్రల్ ఏసీ తదితర సౌకర్యాలతో ఎర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేటర్‌ హైద్రాబాద్ తరహాలో కార్పొరేషన్ కార్యాలయ భవనం నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మేయర్ పునుకొల్లు నీరజ , జిల్లా కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి , డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న , మున్సిపల్ అధికారులు , సిబ్బంది, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement