Saturday, November 23, 2024

కరోనా మృతదేహాల అంత్యక్రియలకు ప్యాకేజీలు

కరోనా మృతుల దహన సంస్కారాలు నిర్వహించేందుకు వారి కుటుంబీకులు బంధువులు వెనకడుగు వేస్తున్నారు. చనిపోయిన వారినుంచి కరోనా తమకు ఎక్కడ అంటుకుంటుందోనని భయంతో ఇలా చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ సిబ్బందే కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌తో మరణించిన వారి అంత్యక్రియలు కూడా ఓ బిజినెస్‌గా మారింది. కోవిడ్‌ బాధిత మృతుల దహన సంస్కారాల సమస్యను పరిష్కరించేందుకు కొన్ని కార్పొరేట్‌ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొస్తున్నాయి. కరోనాతో ఎవరైనా చనిపోతే వారిని వ్యాన్‌లో తీసుకురావడం, దహన సంస్కారాలు.. ఇలా అన్ని పనులు వీరే చూసుకుంటారు. వీటన్నింటికి కలిసి ఓ స్పెషల్‌ ప్యాకేజీని అందిస్తున్నారు. వీటికి రూ.30వేల నుంచి రూ.35వేల వరకు వసూలు చేయనున్నారు. భారత్‌లోని దాదాపు ఏడు ప్రధాన నగరాల్లో వీరి సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఆంథెస్టి ఫ్యూనరల్ సర్వీసెస్‌ ఏజెన్సీకి చెన్నై, బెంగళూరు, జైపూర్‌, హైదరాబాద్‌ వంటి నగరాల్లో బ్రాంచ్‌లున్నాయి. అదే హైదరాబాద్‌లో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించేందుకు రూ.32వేలు వసూలు చేస్తోంది. వీరు సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తి చేసి చితాభస్మాన్ని కుటుంబీకులకు అందజేస్తారు. వీరిలాగే హైదరాబాద్‌లోని ఫ్యునరల్‌ సేవా సర్వీసెస్‌ కూడా పనిచేస్తోంది. ఇది గోల్డ్‌, సిల్వర్‌ అనే రెండు రకాల ప్యాకెజీలను అందిస్తోంది. ఇందుకు రూ.30వేలు తీసుకుంటున్నారు. అయితే కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో స్మశానంలో స్థలం దొరకడం లేదని, తమ వ్యాపారం కష్టంగా మారుతోందని అంత్యక్రియల సేవల నిర్వహకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement