కరోనా దెబ్బకు మళ్లీ సినిమాలు విడుదల తేదీలు వాయిదాల బాట పడుతున్నాయి. సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో జనాలు థియేటర్స్‌కు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు కూడా సినిమా రిలీజ్ విషయంలో కాస్త వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు 2 లక్షలకు పైగా వస్తున్నాయి. నిర్మాతలు మొన్నటి వరకు వరసగా సినిమాల విడుదల తేదీలు అనౌన్స్ చేసారు. కరోనా వచ్చినా కూడా పరిస్థితులు మళ్లీ చక్కబడ్డాయి అనుకుని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ దారుణంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రకటించిన రిలీజ్ డేట్స్‌ను వరసగా మార్చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి.
ఏప్రిల్ 16న రావాల్సిన నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా వాయిదా వేసారు దర్శక నిర్మాతలు. కేవలం పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వాయిదా వేసారు. మరోవైపు ఇప్పుడు ఎప్రిల్ 23న రావాల్సిన టక్ జగదీష్ కూడా వాయిదా పడింది. నాని, రితూ వర్మ జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎప్రిల్ 23న విడుదల చేయాలని ఫిక్స్ చేసారు మేకర్స్. ముందుగా ఎప్రిల్ 16న అనుకున్నా కూడా లవ్ స్టోరీ కారణంగా వారం రోజులు ఆలస్యంగా తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ తేదీ నుంచి కూడా సినిమా పోస్ట్‌పోన్ అయింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. కోవిడ్ తర్వాత తెలుగులో విడుదలవుతున్న భారీ సినిమాల్లో ఆచార్య ముందు వరుసలో ఉంటుంది. మే 13న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో మరోసారి థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆచార్య సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేయనున్నారని తెలుస్తోంది. ఆచార్య సినిమా బడ్జెట్ దాదాపుగా 160 కోట్ల వరకు ఉంటుంది. అంటే సినిమా హిట్ అనిపించుకోవాలంటే దాదాపుగా 200 కోట్ల కలెక్షన్లు అయిన రావాలి. ఇంత భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను ఇలాంటి సమయంలో విడుదల చేసి పాడు చేయడం దర్శక నిర్మాతలకు ఇష్టం లేదని.. అందుకే పరిస్థితులు కాస్త చక్కబడిన తరువాత ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వాళ్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ కూడా వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో ఈ కథను కెమెరాలోకి ఎక్కించడమే కష్టంగా మారినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోతూ ..మొదలవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ ను డిసెంబర్ కి వాయిదా వేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడేవరకూ రిలీజ్ గురించిన ఆలోచన చేయకపోవడం మంచిదనుకున్నారా? కరోనా కలిగించే అంతరాయాల కారణంగా ఆగస్టుకి అన్నిపనులు కావనుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇక తాజాగా విరాటపర్వం మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన నిర్మాతలు తాజాగా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ‘విరాటపర్వం’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. అంతే కాదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన పాన్ ఇండియా మూవి తలైవీని కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. అంతేకాదు ఇప్పటికి బాలీవుడ్ లో పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. అంతేకాదు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది నటీనటులు, కోవిడ్ భారిన పడ్డారు. కరోనా ఎఫెక్ బాలీవుడ్ మీదనే ఎక్కువగా ఉంది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ లు రెగ్యూలర్ గా కొనసాగుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒక వేల షూటింగ్ లు రెగ్యూలర్ గా జరిగిన రిలీజ్ విషయంలో జాప్యం ఏర్పడటం ఖాయంగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కారణంగా సినిమా షూటింగ్‌లు కొన్ని రద్దయ్యాయి. అగ్ర తారలు, సాంకేతిక నిపుణులు పనిచేసే సినిమాల చిత్రీకరణలు వాయిదా పడితే నష్టం మరింత ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. సెట్లు వేస్తారు, లొకేషన్లు అద్దెకు తీసుకుంటారు…ప్రయాణాలతో పాటు చిత్రబృందం బస చేయడానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటారు… కాబట్టి ఉన్నట్టుండి చిత్రీకరణలు ఆగిపోతే అవన్నీ నష్టపోవల్సి వస్తుంది. దీంతో బాక్సాఫీస్‌పై కరోనా ఎఫెక్ట్ మరోసారి పడనుందేని తెలుస్తోంది. సినిమాల రిలీజ్ల వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి దీంతో..ఎంటైర్ ఫిల్మ్, ఇండస్ట్రీ కరోనా కారణంగా మరోసారి కుదేలయ్యే అవకాశం ఉన్నట్లుగా కనబడుతోంది.