Saturday, November 23, 2024

భారత్​లో మరో కొత్త వేరియంట్​​!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వణికిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరుగుతున్న వేళ… తాజాగా దేశంలో మరో కొత్త రకతం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దేశంలోకి మరో కొత్త రకం కరోనా వైరస్‌ ప్రవేశించిందని కేంద్రం ఇవాళ ప్రకటించింది. 18 రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉందని కనుగొన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇప్పటికే 18 రాష్ట్రాలకు పాకిన ఈ వైరస్ ప్రభావంతో భారీగా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన శాంపిల్స్‌ ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త రకం వైరస్‌ను డబుల్ మ్యూటెంట్‌గా పిలుస్తున్నారు. అంటే గతంలో వచ్చిన రకాల కంటే రెట్టింపు ప్రభావం కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా రకరకాల వైరస్‌ల వ్యాప్తి కొనసాగుతోంది. వీటిని అరికట్టేందుకు ఇప్పటికే కేంద్రం ఏప్రిల్‌ 30 వరకూ అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. అయితే ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన ఈ వైరస్‌ల దాడిని వెంటనే గుర్తించడంలో మన వైద్య వర్గాలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పుడు పలు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారి నుంచి సేకరించిన శాంపిల్స్‌ను దేశంలోని 10 జాతీయ స్ధాయి ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. వీటిపై జరుగుతున్న జీనోమ్‌ అధ్యయనాల్లో పలు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

ఇదిఇలా ఉంటే.. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గ‌త‌ 24 గంట‌ల్లో 47,262 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,34,058కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 275 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,441కు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement