కరోనా పేరు వింటేనే గుండెలు జారిపోతున్నాయి. ఒవైపు కరోనా కేసులు పెరుగుతుంటే… మరోవైపు మరణాల సంఖ్య కూడా వేలల్లో నమోదు అవుతోంది. కరోనాతో గుండె జబ్బులు ముంచుకురావటమే కాదు.. అప్పటికే గుండె జబ్బులు గలవారికి తీవ్రమవుతున్నాయి. కొత్త కరోనా వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుండటం తెలిసిందే. అయితే, కొవిడ్ 19తో ఆసుపత్రిలో చేరినవారిలో సమారు 16 శాతం మంది తీవ్రమైన గుండె సమస్యల బారినపడున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా భయాలు, తీవ్ర మానసిక ఆందోళన, ఒత్తిడితో గుండె పగులుతోంది. ఫలితంగా అనేకమంది గుండె జబ్బులకు గురై ఆకస్మికంగా మృతి చెందుతున్నారు. కొవిడ్-19 పరిస్థితుల వల్లే మానసిక ఆందోళనకు గురై మృతి చెందుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి స్థాయి పతాక స్థాయికి చేరడంతో తాత్కాలికంగా గుండె కండరాలు బలహీనమై గుండెపోటుకు గురవుతున్నట్టు కార్డియాలజిస్టులు చెబుతున్నారు.
కరోనా బారినపడిన కొందరు హఠాత్తుగా తీవ్ర గుండె పోటుకు గురవ్వటం.. ఆసుపత్రికి వెళ్లే లోపే మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ కారణంగా రక్తనాళాల్లోని లోపలిపొర దెబ్బతింటుంది. అంతేకాదు నాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలూ పెరుగుతాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఇలా జరగడం సాధారణం. కానీ కరోనా కారణంగా ఈ పరిణామం ఠక్కున సంభవించే అవకాశం ఉంది. ఇలా రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోవడంతో పాటు రక్తపు గడ్డలు(క్లాట్స్) వల్ల గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా కరోనా సీజన్ లో వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ కారణంగానూ గుండెపోటు రావచ్చు అని డాక్టర్లు అంటున్నారు. కరోనా వైరస్ గుండెను ప్రభావితం చేసినప్పుడు కొందరిలో నేరుగా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ వల్ల గుండె కండరానికి ఇన్ఫెక్షన్, కండరంలో వాపు, నొప్పి రావచ్చు. దీన్ని మయోకార్డయిటిస్ అంటారు. ఈ కారణంగా గుండె పనితీరు దెబ్బతిని అది హార్ట్ ఫెయిల్యూర్ కు సైతం దారితీయవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.