కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారిన పడుతున్నట్లు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ కీలకమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ట్విటర్ ద్వారా ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. పీఐబీ ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రం ఈ కేసులు నమోదవుతున్నాయి. పైగా వాళ్లు కూడా కరోనా కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కరోనా సోకినా స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పింది.
కొవిడ్‌ను అరికట్టడానికి వ్యాక్సినేషన్ చాలా కీలకం. అయితే కేవలం 0.03 శాతం నుంచి 0.04 శాతం మందే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్ బారిన పడుతున్నారని తేల్చి చెప్పింది.
వ్యాక్సిన్ తీసుకున్న కరోనా భారినపడ్డవారికి కూడా స్వల్ప లక్షణాలతో మాత్రమే భయటపడుతున్నారని కేంద్రం చెబుతోంది. వ్యాక్సిన్ వైరస్ తీవ్రతను తగ్గించి, తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది. అయితే ఆ సమయంలో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నా పాజిటివ్ అని చూపిస్తుంది. వాళ్ల వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి అని పీఐబీ స్పష్టం చేసింది.