కరోనా ధాటికి వైద్యులు కూడా అల్లాడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో వైద్యులు కూడా అధికంగా కరోనా బారిన పడుతున్నారు. కాగా మహారాష్ట్ర రాజధాని ముంబయి జేజే ఆసుప్రతిలో 61మంది రెసిడెంట్ డాక్టర్లకి కరోనా పాజిటీవ్ గా నిర్థారణ అయింది. దాంతో జేజే ఆసుప్రతి యంత్రాంగం అప్రమత్తమై కరోనా సోకిన వైద్యులను ఐసోలేషన్ లో ఉంచింది. కేవలం జేజే ఆస్పత్రిలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా కరోనా బారినపడుతున్న రెసిడెంట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతున్నదని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ వెల్లడించింది. గడిచిన 48 గంటల వ్యవధిలో మహారాష్ట్ర వ్యాప్తంగా 170 మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా వైరస్ సోకింది. వారిలో రాజధాని ముంబైలోనే 120 మంది ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కరోనా బారినపడ్డ రెసిడెంట్ డాక్టర్లలో సగం మందికి పైగా ఒక్క జేజే హాస్పిటల్‌లోనే ఉండటం గమనార్హం. కాగా మహారాష్ట్రలో కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఇక్కడ 18,466 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 67,30,494కు పెరిగాయి. ఇదే సమయంలో 20 మంది కరోనా వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,41,573కు పెరిగింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం మహారాష్ట్రలో పెరుగుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ మొత్తం 653 ఒమిక్రాన్ వేరియంట్ చేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 259 మంది కోలుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..