కరోనా మూడో దశ ఉధృతి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న అభిప్రాయాలు వాస్తవం కాకపోవచ్చని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. అందరిలాగే వారికి ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్సీఆర్లోని పది ఆసుపత్రుల్లో చికిత్స పొందిన చిన్నారులపై అధ్యయనం సాగింది. 2,600 మంది చిన్నారుల చికిత్సలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు పిల్లల వైద్య నిపుణులతో అధ్యయనం నివేదిక తయారు చేశారు. చాలా మంది పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపించకపోవచ్చని.. కనిపించినప్పటికీ తేలిక పాటి, లేదంటే మితంగా ఉండొచ్చన్నారు. వైద్యుల సలహాతోనే ఇంట్లోనే చికిత్స అందివచ్చని పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది చిన్నారులు, జ్వరం, శ్వాస సమస్యలు, విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి ఇబ్బందులు పడే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లో పిల్లలకు కొవిడ్ ముప్పు పేరుతో ద లాన్సెట్ కొవిడ్-19 కమిషన్, ఇండియన్ టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా పిల్లల వైద్య నిపుణులు నివేదికను రూపొందించారు. థర్డ్ వేవ్‌లో కేవలం పిల్లలకే అధిక ముప్పు ఉంటుందన్నది సరికాదని నిపుణులు పేర్కొన్నారు.
మరో వైపు కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన చిన్నారుల్లో 2.4శాతం మరణాలు సంభవించాయని నిపుణులు తెలిపారు. 9శాతం మందే తీవ్రమైన లక్షణాలతో బాధపడినట్లు పేర్కొన్నారు. డయాబెటిస్, క్యాన్సర్, రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి దిగజారుతోందని అధ్యయనం పేర్కొంది. సాధారణంగా ఆరోగ్యకరమైన పిల్లలలో కరోనాతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా తక్కువని తెలిపింది.