దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. దీంతో కరోనా కేసులు మళ్లీ ఒకప్పటిలా పెరుగుతున్నాయి. రోజు రోజుకు చూస్తుండగానే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేయడం సాధ్యమయ్యేటట్లు లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన నెల రోజుల్లో పెరిగిన కరోనా కేసుల గణాంకాలు చూసుకుంటే రాబోయే కాలంలో ప్రమాదం దగ్గర్లోనే ఉందనే విషయం స్పష్టమవుతోంది. మొదట్లో కరోనా కేసులు నమోదయినప్పుడు 2020 సెప్టెంబర్ లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 16 సెప్టెంబర్ 2020 నాడు 97 వేల కరోనా కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు ఇదే హైయోస్ట్. ప్రస్తుతం కరోనా కేసులు 80 వేలకు పైగానే నమోదవుతున్నాయి. 2021 మార్చి మొదటి వారంలో కరోనా కేసుల సంఖ్య 20 వేల లోపే నమోదయ్యాయి. కాని గడిచిన నెలలోనే కేసులు మూడు రేట్లు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం గత రెండు రోజుల నుంచి 80 వేల కేసులు నమోదవుతున్నాయి.
ఏప్రిల్ నెల మధ్య వరకు కరోనా పాజిటివ్ కేసులు తారా స్థాయికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే మే నెల చివర వరకు సంక్రమణ కేసులు తగ్గే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. సూత్ర అనే గణిత విశ్లేషణ సంస్థ ఈ అంచనా వేసింది. భారత్‌లో వచ్చిన తొలి వేవ్‌పై కూడా సూత్ర గతంలో ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆగస్టులో కేసులు పెరిగి సెప్టెంబర్ వరకు హెచ్చు స్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత 2021 ఫిబ్రవరిలో మళ్లీ కేసులు తగ్గుతాయని సూత్ర అంచనా వేసింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన మహీంద్ర అగర్వాల్ కేసుల పెరుగుదలపై అంచనాలు చేశారు.
ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. మిడ్ ఏప్రిల్ వరకు ఆ సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. ఏప్రిల్ 15 నుంచి 20 నాటికి కేసులు సంఖ్య గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. అంతే వేగంగా కూడా మే చివరి నాటికి కేసులు తగ్గుతాయని అగర్వాల్ తెలిపారు. కొత్త ఇన్‌ఫెక్షన్ల డేటా ఆధారంగా కేసుల సంఖ్యను అంచనా వేస్తున్నామని, తొలుత పంజాబ్, ఆ తర్వాత మహారాష్ట్రలో కరోనా కేసులు తారా స్థాయికి చేరుకుంటాయని ఆయన అన్నారు. ఏప్రిల్-మే నెల మధ్య కాలంలో కేసులు గరిష్ట స్థాయిలో ఉంటాయని అశోకా వర్సిటీ శాస్త్రవేత్త గౌతమ్ మీనన్ తెలిపారు. కాబట్టి ఈ నెలలో వీలైనన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఈ నెల కాలంలో కేసుల ఉదృతిని ఆపినట్లయితే కేసుల పెరుగదలకు అడ్డుకట్టవేయవచ్చు.