తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో కొవిడ్ చాలావరకు అదుపులోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు. అన్ని జ్వరాలను కరోనా వల్ల వచ్చే జ్వరంగా భావించవద్దని సూచించారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో మలేరియా కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు.
హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు వచ్చాయని శ్రీనివాస్ వెల్లడించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో 340 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,200 డెంగీ కేసులు వచ్చాయని వివరించారు. పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్ లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు పని చేస్తున్నాయని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించామని శ్రీనివాస్ వెల్లడించారు. 56 శాతం మందికి తొలి డోస్, 34 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 90 శాతం మంది ప్రజలకు తొలిడోసు వేశామని శ్రీనివాస్ తెలిపారు.
ఈ వార్త కూడా చదవండిః రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన పూజారులు