చాలా రోజుల తర్వాత శబరిమల ఆలయం తెరుచుకోనుంది. నేటి సాయంత్రం 5గంటలకు దేవస్థానం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ గర్భగుడిని తెరవనున్నారు. రేపటి నుంచి అయ్యప్ప స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. కరోనా ఆంక్షల కారణంగా రోజుకు 30 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. శబరిమల దర్శనానికి వచ్చేవారు కరోనా నిబంధనాలు పాటించాల్సి ఉంటుంది. కేరళలో వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కఠినమైన ఆంక్షలు విధించింది కేరళ ప్రభుత్వం. శబరిమల దర్శనానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి చేసింది. నెగెటివ్ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి లభిస్తుంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలి. దర్శనానికి వచ్చేవారు విధిగా తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని ట్రావెన్ కోర్ దేవస్థానం కోరింది. అయితే ఈసారి అయ్యప్ప భక్తులకు పంపానదిలో స్నానానికి అనుమతి ఇచ్చారు. స్వామివారి దర్శనం పూర్తయిన వెంటనే భక్తులు ఆలయ పరిసరాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. శబరిమలలో డిసెంబరు 26న మండల పూజ ముగుస్తుంది. డిసెంబరు 30న మకర విళక్కు కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement