న్యూఢిల్లి : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా శనివారం 16.65 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,71,202 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శుక్రవారంతో పోలిస్తే.. 2,369 కేసులు తక్కువగా రికార్డయ్యాయి. అదేవిధంగా 314 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 3.71 కోట్లకు చేరుకున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు 4,86,066 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 15,50,377 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,38,331 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు శుక్రవారంతో పోలిస్తే.. స్వల్పంగా తగ్ఇ 16.28 శాతానికి చేరుకుంది. వీక్లీ పాజిటివిటీ రేటు 13.69 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర 42,462 కేసులతో టాప్‌లో ఉంది. దేశ వ్యాప్తంగా క్రియాశీల రేటు 4.18 శాతానికి చేరుకుంది. శుక్రవారంతో పోలిస్తే.. 749 కేసులు తగ్గాయి. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 94.51 శాతానికి పడిపోయింది.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ విజృంభణ
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి 7,743 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. శుక్రవారంతో (6041)తో పోల్చితే కొత్త కేసుల్లో దాదాపు 28.17 శాతం పెరుగుదల నమోదైంది. శనివారం కొత్తగా 1,702 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 125 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకొచ్చాయి. కేసులు పెరుగుతుండటంతో.. పలు రాష్ట్రాలు లాక్‌డన్ విధించాయి. ఇప్పటికే తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ వారాంతపు లాక్‌డన్ విధించింది. ప్రతీ ఆదివారం లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఢిల్లి, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతున్నది. కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలంతా తప్పకుండా కరోనా మార్గదర్శకాలు పాటించాలని కోరుతున్నాయి.
పార్లమెంట్‌ను వీడని కరోనా
పార్లమెంట్‌ను కరోనా వీడటం లేదు. 850 మందికి పైగా సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో 250 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బందే ఉన్నారు. కేసులు పెరుగుతుండటంతో పార్లమెంట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఎలాంటి లక్షణాలు లేని వారు మాత్రమే విధులకు హాజరుకావాలని సిబ్బందిని ఆదేశించారు. స్వల్ప లక్షణాలు ఉన్నా.. విధులకు రావొద్దని, అవసరం అయితే ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు రెండు విభాగాలుగా ఉద్యోగులను విధులకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు అందాయి. 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడ్తారు.