ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. చిత్తూరు జిల్లాలో పాజిటివ్ పేషెంట్ల మిస్సింగ్ కలకలం రేపుతోంది. వెయ్యి మంది కరోనా రోగుల ఆచూకీ లభించడం లేదు. గత రెండు నెలల కాలంలో జిల్లాలో 9,164 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 7,270 మందిని మాత్రమే గుర్తించారు. 1049 మంది రోగుల ఆచూకీ గల్లంతు అయ్యింది. సంబంధిత ఇంటి నెంబర్లలో రోగుల జాడ లేదు. వారి ఫోన్లు కూడా పనిచేయడం లేదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కోసం అధికారుల ట్రేసింగ్ చేస్తున్నారు. మరో 845 మంది పాజిటివ్ రోగులు తిరుపతి వదిలి బయటికి వెళ్లినట్లు గుర్తించారు. బాధితులు శాంపిల్స్ తీసుకునే సమయంలో ఫోన్ నంబర్లు, తాము నివాసం ఉంటున్న చిరునామాలు తప్పుగా ఇస్తున్నారు. కరోనా ఫలితాలు రాకముందే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతునట్లు తెలుస్తోంది.ఈ తరహా వ్యక్తులు వైరస్ ను ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేస్తున్నారని అధికారులు అంటున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో మహోగ్రరూపం దాల్చిన కరోనా ధాటికి ఏపీ జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. నిత్యం వేలల్లో కొత్త కేసులు వస్తుండడం, పెద్ద సంఖ్యలో మృత్యువాతపడుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. నిన్న రాష్ట్రంలో 74,435 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,434 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 1982 కేసులు నమోదు అయ్యారు. జిల్లాలో ఇప్పటికే మహమ్మారి కారణంగా పలువురు మృతి చెందారు.