న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. ఐరోపా దేశాలు ఇప్పటికే డెల్టా వేరియంట్ తో అల్లకల్లోల పరిస్థితుల్లో ఉండగా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ మరింత భయాందోళనలను కలిగిస్తోంది. బి.1.1529గా పిలుస్తున్న ఈ కొత్త వేరియంట్ కు ను అని పేరు పెట్టారు. డెల్టా వేరియంట్ కన్నా వేగంగాను, తీవ్ర లక్షణాలతోనూ వేధించే ఈ వేరియంట్ వల్ల దక్షిణాఫ్రికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు మరోసారి చిక్కుల్లో పడబోతున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు.
పర్యాటక రంగంపై ఆధారపడిన దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ మూడు దశాబ్దాలుగా దెబ్బతింది. రెండేళ్లుగా కోవిడ్ వల్ల మరింత చిన్నాభిన్నమైంది. కొద్దినెలలుగా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తూ వచ్చిన దక్షిణాఫ్రికాలో మళ్లీ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటున్న వేళ బొత్స్వానాలో సరికొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. సరిగ్గా రెండువారాల క్రితం తొలి కేసును గుర్తించారు. ఆ తరువాత కొద్దిరోజులకే 22 కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఈ వేరియంట్ సంక్రమణవ్యాప్తి వేగం డెల్టాకన్నా వేగంగా ఉందని తేల్చారు. కోవిడ్ పరీక్షలు చేసిన 100 మంది రోగుల్లో 75 శాతం ను వేరియంట్ వే. కరోనా వైరస్ కు ఉండే ప్రోటీన్ కొమ్ముల్లో వస్తున్న మార్పులవల్లే రానురాను బలపడి కొత్తరూపంతో పీడిస్తోంది. తాజా వేరియంట్లో 55 రకాల జన్యుమార్పులనుగుర్తించారు. దక్షిణాఫ్రికానుంచి రాకపోకలపై ఐరోపా దేశాలు నిషేధం విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికా ఆర్థిక, పర్యాటకరంగం ఎక్కువగా బ్రిటన్ పై ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ దేశం కఠిన నిర్ణయం తీసుకుంది. అలాగే ఫ్రాన్స్ కూడా నిషేధం విధించింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా దేశాల్లో లాక్ డౌన్ ఆంక్షలు పెద్దగా లేవు. దీంతో కొత్త వేరియంట్ వ్యాప్తి ఉధృతమవుతోంది. ఆ దేశాలనుంచి వచ్చిన పర్యాటకుల ద్వారా హాంగ్ కాంగ్ లో కొత్త వేరియంట్ కేసు వెలుగుచూసింది. దీనిని గమనించిన చైనా ఇప్పటికే అప్రమత్తమైంది. ఏతావాతా ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్నాయి. రెండు డోసులు తీసుకున్నవారిలోనూ ఈ కొత్త వేరియంట్ ప్రభావం చూపడం, వేగంగా వ్యాప్తి చెందడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ను వేరియంట్ ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం సుదీర్ఘ సమీక్ష చేసింది. కొత్త వేరియంట్ ను ఆషామాషీగా తీసుకోరాదని హెచ్చరించింది. ఇప్పటికే 35 శాతానికి పైగా నిరుద్యోగిత ఉన్న దక్షిణాప్రికా ఆర్థికవ్యవస్థ మినుకుమినుకుమంటోంది. తాజా పరిణామాలతో మరింత దిగజారిపోవచ్చు.
ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాలో B.1.1.529 కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందన్న వార్తతో భారత్ అలర్ట్ అయింది. B.1.1.529 స్పైక్ ప్రోటీన్‌లో 32 మ్యుటేషన్లు ఉన్నట్లుగా భావిస్తోంది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పూర్తిగా మూడంచెల స్క్రీనింగ్ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా.. ఎయిమ్స్ కు చెందిన సెంటర్ ఫర్ కమ్యూనిటీ డాక్టర్ సంజయ్ రాయ్ కూడా స్పందించారు. కొత్త వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదమని.. చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు సంజయ్ రావయ్.