ప్రపంచమంతటా కరోనా, ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి భారీగా కేసులు నమోదవుతున్నాయి. విద్యాసంస్థల్లో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఒక పాఠశాలలో మొత్తం 147 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం రేపింది. భారీ స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూశాయి. తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో ఏకంగా 70 మందికి కరోనా సోకింది. ఏర్పేడు జోన్‌లోని ఐఐటీ శాశ్వత క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామనీ, ఈ క్రమంలోనే భారీగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని అధికారులు తెలిపారు.
తిరుపతి ఐఐటీలో కరోనా బారినపడ్డ 70 మందిలో 40 మంది విద్యార్థులు, 30 మంది బోధన సిబ్బంది ఉన్నారు. వీరంతా కూడా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ నెల మొదటి వారంలో తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లోని 600 మంది విద్యార్థులు సంక్రాంతి సెలవుల కోసం సొంత ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం క్యాంపస్‌లో ఇంజనీరింగ్, ఎం.టెక్ , పిహెచ్‌డి చివరి సంవత్సరం విద్యార్థులు మాత్రమే ఉన్నారు. క్యాంపస్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..