ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా 2022లో కరోనా మహమ్మారిని ఖతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) చీఫ్ టెడ్రోస్ పిలుపునిచ్చారు. దీనికోసం అందరూ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. క్రిస్మస్ పండుగల కోసం అక్కడ జనం సమూహాలుగా ఏర్పడితే వైరస్ ఇంకా దారుణంగా ప్రబలే ప్రమాదం ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కీలకంగా మారాయి.
జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో టెడ్రోస్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్లాంటి కొత్త వేరియంట్ల రూపంలో కరోనా మహమ్మారి ప్రపంచంలో కలకలం సృష్టిస్తోంది. పండుగల టైమ్లో ఆంక్షలు కంపల్సరీ విధించాలి. ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ మిగతా వేరియంట్ల కన్నా చాలా వేగంగా వ్యాపిస్తోంది. అందువల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా పండుగలు చేసుకోకపోవడం మంచిది.. అని ట్రెడోస్ సూచించారు. చాలా దేశాలలో ఇప్పటికే జనం మొదటి కొవిడ్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారని, మరోవైపు ధనిక దేశాలు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటున్నాయని అన్నారు. ఈ పరిస్థితి మారాలని.. ప్రపంచమంతా సమాంతరంగా వ్యాక్సినేషన్ జరిగితే మంచిదని టెడ్రోస్ పేర్కొన్నారు.