తెలంగాణలో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో స్కూల్స్, కాలేజీలపై ఆ ఎఫెక్ట్ పడనుంది. పాఠశాలలు నడపడంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తే మంచిదనే యోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం. రేపటితో పండుగ సెలవులు ముగియనున్నాయి. కాగా, ఎల్లుండి నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది. అయితే మరో 2 వారాల పాటు సెలవులు పొడిగించాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా విద్యాశాఖ నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు దాకా సెలవులు పొడిగించే అవకాశం ఉందని కొంతమంది అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించింది ప్రభుత్వం. దీనివల్ల రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తోంది. మరోవైపు ఈ నెల చివరి వరకు కేసులు భారీగా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్న కారణంగా నెలాఖరు వరకు విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.