Saturday, November 23, 2024

క్రమంగా పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

ఏపీలో రాష్ట్రంలో కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్కడక్కడా మరణాలూ సంభవిస్తున్నాయి. వ్యాధి బారినపడిన కొందరికి ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు కూడా చేసినట్లు ఈఎన్‌టీ వైద్యులు చెబుతున్నారు. గతంలో అవయవ మార్పిడి చేసుకున్నవారు, క్యాన్సర్‌ బాధితులు.. రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడటం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ సోకేది. కరోనా రెండో దశలో కొవిడ్‌ బారినపడి చికిత్సలో భాగంగా స్టెరాయిడ్‌లు వాడిన వారిపై ఈ ఫంగస్‌ దాడి చేస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే, మందులతో నయం చేయవచ్చని చెబుతున్నారు. వ్యాధి తీవ్రతపై అవగాహనలేమి, ఆలస్యం చేయడం వల్ల శస్త్రచికిత్స అవసరమవుతోంది.

కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో ముక్కు దిబ్బడ, వాపు, ముక్కు నుంచి రక్తం, నల్లడి పదార్థం కారడం, కంటివాపు, ముఖం మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు బాధితులు బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలున్న వారు ఎక్కువగా ప్రైవేటు వైద్యులనే ఆశ్రయిస్తుండటంతో అధికారికంగా రికార్డులకు ఎక్కడం లేదు. ‘నేను 1998లో వైద్యం ప్రారంభించాను. కరోనా రెండో దశకు ముందు మొత్తంగా 5-10 బ్లాక్‌ ఫంగస్‌ కేసులే చూసి ఉంటాను. ఇప్పుడు రోజుకే ఐదారు వస్తున్నాయి’ అని ఈఎన్‌టీ వైద్యుడొకరు తెలిపారు.

బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి చికిత్సలో పొసాకోనాజోల్‌ అనే మాత్రలు, లిపోసోమల్‌ యాంఫోటెరిసిన్‌-బి అనే ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చే మందు ప్రధానంగా వినియోగిస్తారు. రోగికి శస్త్రచికిత్స అవసరమైతే యాంఫోటెరిసిన్‌-బి ఔషధం ఉండాల్సిందే. గతంలో ఇది కొద్దిమందికే అవసరమయ్యేది కాబట్టి కొన్ని ఔషధ దుకాణాల్లోనే అమ్మేవారు. పరిమిత దుకాణాల్లో తేలిగ్గానే దొరికేది. వైద్యులు డీలర్లకు ఆర్డర్‌ పెడితే వెంటనే ఇచ్చేవారు. తాజాగా బ్లాక్‌ఫంగస్‌ కేసులు పెరుగుతుండటంతో యాంఫోటెరిసిన్‌-బికి డిమాండ్‌ ఏర్పడింది. వ్యాధి తీవ్రతను బట్టి 60-70 ఇంజక్షన్లు అవసరమని, కొందరికి 100 వరకు ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. రోగి బరువును బట్టి ఎంత పరిమాణంలో మందు ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. ఒక కిలో బరువుకు రోజుకు ఐదు మిల్లీగ్రాముల మందు ఇవ్వాలి. అంటే రోగి బరువు 60 కిలోలుంటే రోజుకు 300 మిల్లీగ్రాముల మందు ఇవ్వాలి. ఒక్కో వయల్‌లో 50 మి.గ్రా మందు ఉంటుంది. అంటే రోజుకు 6 వయల్స్‌ కావాలి. కనీసం పది రోజులు ఇంజక్షన్లు చేయాల్సి వస్తుందనుకుంటే 60 వయల్స్‌ కావాలి. ఈ డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో ఈ మందులకు కొంత కొరత ఉంది.

రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఎక్కడైనా ఉన్నాయా? లేవా? అన్న అంశంపై సోమవారం సాయంత్రంలోగా స్పష్టత వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, నిజంగా కేసులు ఉన్నా తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై సామాజిక మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వస్తున్న వార్తలపై వాస్తవాలను తెలుసుకునేందుకు సీనియర్‌ అధికారులు, ఆసుపత్రుల పర్యవేక్షణాధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ఔషధాల కోటా కేటాయిస్తుందని, రాష్ట్రంలోనూ 1,600 యాంఫోటెరిసిన్‌-బి వయల్స్‌ కొనుగోలు చేసి అందుబాటులో ఉంచామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement