Friday, November 22, 2024

Train Update | పట్టాలెక్కిన కోరమండల్​ రైలు.. షాలిమర్​ నుంచి చెన్నైకి పెరిగిన రద్దీ!

మూడు రైళ్ల ప్రమాదం​ తర్వాత కోరమండల్​ ఎక్స్​ప్రెస్​ ఇవ్వాల (బుధవారం) మళ్లీ పట్టాలెక్కింది. రైలు ప్రమాదంలో 288 మంది చనిపోగా, 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన ఐదు రోజుల తర్వాత కోరమండల్ ఎక్స్ ప్రెస్ బుధవారం పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుండి చెన్నైకి బయలుదేరింది. షాలిమార్ స్టేషన్ నుండి ఇవ్వాల (జూన్ 7, 2023) మధ్యాహ్నం 3.25 గంటలకు ​ రైలు బయలుదేరిందని సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారి తెలిపారు.

స్టేషన్‌లో కనిపించిన దయనీయ దృశ్యం..

రైలు ప్లాట్‌ఫారమ్ 2 వద్దకు రాగానే జనరల్ కంపార్ట్ మెంట్‌లోకి వెళ్లేందుకు హడావిడి నెలకొంది. రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు త్వరగా ప్రయాణికులు.. వారి వస్తువులతో నిండిపోయాయి. రైలులో కొందరు ప్రయాణికులు దేవుడి విగ్రహాలను తీసుకెళ్లడం కనిపించింది. జూన్ 2వ తేదీన జరిగిన ప్రమాదంలో తప్పిపోయిన తన కొడుకుని వెతుకుతూ రంజిత్ మొండల్ భువనేశ్వర్‌కు రైలు ఎక్కాడు. తన 18 ఏళ్ల కుమారుడు దీపాంకర్ చెన్నైలో ఉద్యోగం కోసం స్నేహితులతో కలిసి వెళ్లాడని, ఈ రైలులోనే ఎక్కాడని మొండల్ కన్నీటితో చెప్పాడు.

ప్రమాదం జరిగినప్పటి నుండి అతని ఫోన్ రింగ్ అవుతోంది. కానీ, ఎవరూ దాన్ని తీయడం లేదు. ప్రమాదానికి నిమిషాల ముందు వరకు అతనితో మాట్లాడాను. అతని వివరాలేవీ తెలియడం లేదు. డిటెయిల్స్​ని ఇంకా ట్రాక్ చేయలేదు. నేను అతనిని మళ్లీ వెతకాలని నిర్ణయించుకున్నాను అని దీపాంకర్​ తండ్రి మొండల్​ చెప్పాడు. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ ఫైజ్ అహ్మద్ ఖాన్ మృతుడి కుటుంబ సభ్యులను కలిశారు.

- Advertisement -

ఇక.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ “ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు” పట్టాలు తప్పడానికి కారణమని అన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ అనేది ట్రాక్‌ల సెట్‌లో రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నిరోధించే సిగ్నల్‌ల వ్యవస్థ. ఇక.. ఒడిశాలోని బాలాసోర్‌లో ప్యాసింజర్ రైలు సేవలు సోమవారం పునరుద్ధరించారు. హౌరా-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రిపేర్లు చేసిన రైల్వే మార్గంలో ప్రయాణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement